TSRTC Special Buses for Kurumurthy Jatara: తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ (#TGSRTC) నడుపుతోంది. కురుమూర్తి జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం నవంబర్ 8వ తేదిన ఉండగా.. 7 నుంచి 9వ తేది వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భారీ సంఖ్యలో భక్తులు చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల నుంచి జాతరకు వస్తుంటారు.
ఈ క్రమంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను హైదరాబాద్ (Hyderabad) నుంచి సంస్థ అందుబాటులో ఉంచుతోంది. ఎంజీబీఎస్ (MGBS) నుంచి ఆరాంఘర్, మహబూబ్‌నగర్ మీదుగా బస్సులు కురుపూర్తి జాతరకు వెళ్తాయి. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను ఆర్టీసీ సంస్థ కల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని సురక్షితంగా శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం భక్తులను కోరుతోంది.
కురుమూర్తి ఎక్కడ ఉంది..
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని గ్రామం కురుమూర్తి. ఇది చిన్నచింతకుంటకు 5 కి. మీ. దూరంలో ఉంటుంది. మరో జిల్లా కేంద్రమైన వనపర్తి నుంచి 39 కి. మీ. దూరంలో కురుమూర్తి ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. మహబూబ్ నగర్ నుండి కర్నూలు వెళ్ళు రైలు మార్గములో కురుమూర్తి ఉంది. ఈ గ్రామంలో జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచిన వేంకటేశ్వర దేవస్థానం ఉంది.
కురుమూర్తి ఆలయ స్థల పురాణం..
ఆకాశరాజు కుమార్తె పద్మావతిదేవిని వివాహం చేసుకునేందుకు వేంకటేశ్వరస్వామి కుబేరుడితో అప్పు తీసుకున్నారని తెలిసిందే. అయితే తీసుకున్న అప్పును తీర్చలేక స్వామి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాను తీసుకున్న గడువు ముగియనుండటంతో అప్పు తీర్చాలని కుబేరుడు పదే పదే ఒత్తిడి చేశాడు. దాంతో కలత చెందిన వెంకటేశ్వరస్వామి ఓ అర్ధరాత్రి తిరుమలను వదిలి ఉత్తర దిశగా వెళ్తారు. జూరాల వద్ద గుండాల జలపాతం వద్ద నది ప్రవాహాన్ని చూసి పరవశించిన స్వామివారు అక్కడ పవిత్ర స్నానమాచరిస్తారు. అప్పటి వరకు తెల్లగా ప్రవహించిన నదిలోని నీరు స్వామివారి స్పర్శతో నీలం రంగులోకి వస్తుంది. అది చూసిన స్వామి కృష్ణా అంటూ సంభోదించడంతో కృష్ణమ్మ ప్రత్యక్షమై కాలినడకతో వస్తున్న స్వామివారికి పాదుకలను బహూకరిస్తుంది.
జురాల నుంచి బయలుదేరిన స్వామివారు ప్రశాంతంగా ఉన్న కురుమూర్తి కొండలకు చేరుకుంటారు. అక్కడే కాంచన గుహలో సేదతీరేందుకు ఆగిపోతారు. మరోవైపు తిరుమలలో తన పక్కన స్వామి వారు లేరన్న బెంగతో పద్మావతిదేవి జాడ శ్రీవారిని కోసం అన్వేషిస్తూ కురుమూర్తి చేరుకుంటారు. తన వెంట తిరుమలకు రావాలని స్వామివారిని అమ్మవారు ప్రాదేయపడారు. తనకు ఇష్టంగా మారిన కురుమూర్తి కొండలను వదిలి వెళ్లలేక తనతో పాటు పద్మావతిదేవి ప్రతి రూపాలను ఆ కాంచన గుహలోనే వదిలి వెళ్లారని పూర్వీకులు నుంచి చెబుతారు. అక్కడి స్వామివారు భక్తుల కోరికలను తీర్చడంతో వారు ప్రేమతో కానుకలను సమర్పించుకుంటున్నారు. ఆ కానుకలను కుబేరుడి అప్పు తీర్చేందుకు వినియోగిస్తారని భక్తులు విశ్వసిస్తారు.