ICC World Test Championship: గతంలో ఎప్పుడూ లేనివిధంగా... క్రికెట్ ప్రపంచం ఊహించని విధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(World Test Championship) ఫైనల్లో స్థానం కోసం జట్ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. న్యూజిలాండ్(New Zealand) చేతిలో భారత్(India) ఓటమి.. బంగ్లాదేశ్(Bangladesh) పై దక్షిణాఫ్రికా(South Africa) సిరీస్ విజయం.. ఇంగ్లండ్(england) పై పాక్(Pakistan) గెలుపుతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల జాబితా దాదాపుగా మారిపోయింది. బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుని... ఫైనల్లో స్థానం కోసం దూసుకొస్తోంది. ఈ జట్ల రాక భారత్ జట్టుకు డేంజర్ బెల్స్ మూగిస్తోంది. అయితే వచ్చే ఏడాది లార్డ్స్‌లో జరిగే టైటిల్ పోరులో తలపడేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు... WTC ఫైనల్ స్పాట్‌ల కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. 




 

భారత్ కే అవకాశాలు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ముందు భారత్.. ఆస్ట్రేలియాతో మరో అయిదు టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను కోల్పోయినా  రోహిత్ జట్టు ఇప్పటికీ అగ్రస్థానంలో స్వల్ప ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. బ్లాక్ క్యాప్స్‌తో జరిగిన మూడో టెస్టులోనూ భారత్ ఓడితే  ఆస్ట్రేలియాపై టీమిండియా కనీసం నాలుగు మ్యాచ్‌లను గెలవాలి. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్ భారత్‌కు చాలా కీలకం. ఆస్ట్రేలియాపై విజయయాత్ర కొనసాగితే మూడో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ చేరే అవకాశం ఉంది. 

 

ఆస్ట్రేలియా 

ఆస్ట్రేలియాకు కూడా అవకాశాలు బానే ఉన్నాయి. ఆస్ట్రేలియా భారత్తో రెండు టెస్టులు, శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేత అయిన ఆస్ట్రేలియా.. మరోసారి ఫైనల్ చేరి కప్పు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే పాట్ కమిన్స్ జట్టు 2023లో గెలిచిన టైటిల్‌ను కాపాడుకోవాలంటే మిగిలిన ఏడు టెస్టుల్లో కనీసం నాలుగింటిని గెలవవలసి ఉంటుంది. భారత్‌పై 5 టెస్టులు, లంకపై రెండు టెస్టులు ఆస్ట్రేలియా  ఆడనుంది. 

 

శ్రీలంక 

ఎవరూ ఊహించని విధంగా శ్రీలంక కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో స్థానం కోసం తీవ్రంగా తలపడుతోంది. లంక.. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు... ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు ఆడనుంది. శ్రీలంక మిగిలిన నాలుగు టెస్టుల్లో మరో మూడు విజయాలు సాధిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ పొందే అవకాశం ఉంది. కానీ దక్షిణాఫ్రికాలో రెండు టెస్టులు, స్వదేశంలో కంగారులతో రెండు టెస్టులు గెలవడం లంకకు కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

 

దక్షిణాఫ్రికా

బంగ్లాదేశ్ పై సిరీస్ విజయంతో దక్షిణాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులోకి దూసుకొచ్చింది. దక్షిణాఫ్రికా శ్రీలంకతో స్వదేశంలో రెండు.. పాకిస్థాన్ తో రెండు టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్‌పై 2-0 సిరీస్ వైట్‌వాష్ దక్షిణాఫ్రికాకు వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. ప్రొటీస్ సొంత గడ్డపై నాలుగు మ్యాచుల్లో కనీసం మూడింటిలో విజయం సాధిస్తే కల నెరవేరే అవకాశం ఉంది. నవంబర్ చివరిలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల హోమ్ సిరీస్ ప్రోటీస్‌కు కీలకమైనది. ఆ సిరీస్ స్వీప్ చేస్తే దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుకోవడం ఖాయమే. 

 

న్యూజిలాండ్ 

న్యూజిలాండ్ కు భారత్ లో ఒక టెస్టు, ఇంగ్లండ్ తో మూడు టెస్టులు మిగిలి ఉన్నాయి. బ్లాక్ క్యాప్స్ ఫైనల్‌కు చేరుకోవడానికి వారి మిగిలిన నాలుగు టెస్టుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది, అంటే వారు భారత్‌పై మూడో టెస్టులోనూ.. ఇంగ్లాండ్‌పై సిరీస్ స్వీప్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. కివీస్‌ ఫైనల్ కు వెళ్లడం చాలా కష్టం. మిగిలిన జట్లు దాదాపుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు సాధించే అవకాశాన్ని కోల్పోయాయి.