RTC MD Sajjanar Tweet On Bike Stunts: తక్కువ టైంలో ఫేమస్ కావాలని చాలామందికి ఉంటుంది. అందుకు నేటి యువత ఎంచుకునే  ఏకైక సాధనం సోషల్ మీడియా. ఈ క్రమంలోనే పలు పిచ్చి చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎదుటివారికి ప్రమాదం అని తెలిసినా పాపులర్ అయ్యేందుకు బైక్స్‌తో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా, దీపావళి సందర్భంగా కొందరు ఆకతాయిలు చేసిన పనికి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైటెక్ సిటీ ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టానుసారంగా క్రాకర్స్ కాలుస్తూ బైక్‌పై విన్యాసాలు చేశారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


దీన్ని షేర్ చేస్తూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోంది ఈ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. అలాంటి మంచి రోజున ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంతవరకూ సమంజసం.?' అని ఆయన ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలనే రిస్క్‌లో పెట్టుకుంటున్నారని.. ఈ విపరీత చర్యలతో మిగతా ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేశారు.




10 మందిపై కేసు


ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్‌తో రాయదుర్గం పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ రైడర్స్‌పై కేసు నమోదు చేశారు. సుమారు 10 మందిని అదుపులోకి తీసుకుని బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. గత రెండున్నరేళ్లలో ఇలా బైక్ స్టంట్స్ చేసిన 250 పైచిలుకు బైక్స్ స్వాధీనం చేసుకున్నామని.. ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా.. కొందరు యువత తీరు మాత్రం మారడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఎవరైనా జాతీయ రహదారులపై స్టంట్స్ వేసినా.. ప్రజలను ఇబ్బందులు పెట్టేలా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐటీ కారిడార్లు, జాతీయ రహదారులపై బైక్ రేసింగ్‌లకు పాల్పడినా తీవ్ర చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.


Also Read: Tiger Tension: నిర్మల్ జిల్లా కుంటాలలో పెద్దపులి సంచారం- రైతులు, స్థానికులకు అటవీశాఖ కీలక సూచనలు