Tiger roaming in Kuntala area of Nirmal district | కుంటాల: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని సూర్యపూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. సూర్యపూర్ అటవీ ప్రాంత శివారులో శుక్రవారం పెద్దపులి ఓ కోడెదూడను హతమార్చింది. స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు దూడ కళేబరానికి సమీపంలో ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పులి, పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ క్షణంలో దాడి చేస్తుందేమోనని భయపడుతన్నారు.
కోడెదూడను వేటాడిన పెద్దపులి, ట్రాప్ కెమెరాలో అంతా రికార్డ్
భైంసా రేంజ్ అధికారి వేణుగోపాల్ శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని కెమెరాను పరిశీలించగా పులి కోడెదూడ కళేబరం వద్దకు వచ్చిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీంతో వారి అంచనాలకు బలం చేకూరింది. దీన్ని మగపులిగా నిర్ధారించారు. కోడెదూడ కు సంబంధించి ఆ యజమానికి అటవీశాఖ తరఫున పరిహారం అందిస్తామన్నారు. తక్షణ సహాయంగా రూ.5000 అందజేశారు. సమీప రైతులు సరిహద్దుల్లో ఉన్న గ్రామస్తులకు పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పులికి ఎలాంటి హాని కలగకుండా అడవి పందులకు అమర్చే విద్యుత్ కంచెలను తొలగించాలన్నారు.
బైంసా ఎఫ్ఆర్ఓను సంప్రదించిన ఏబీపీ దేశం
పులి సంచారం గురించీ బైంసా ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ తో abp దేశం ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఆయన పలు విషయాలు వెల్లడించారు. కుంటాల మండలంలోని సూర్యపూర్ అటవీ ప్రాంతంలో తమ రేంజి పరిధిలో పులి సంచరిస్తోందని చెప్పారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర అభయారణ్యం నుండి కిన్వట్ సరిహద్దు గుండా ఆదిలాబాద్ జిల్లా బోధ్ పరిసరాల్లోంచి, మళ్ళీ సారంగాపూర్ అటవి ప్రాంతంలో నుండీ ఇటు వైపు వచ్చినట్లు వివరించారు. పులి మహారాష్ట్ర సరిహద్దులు దాటే వరకు రెండు, మూడు ప్రత్యేక బృందాల పర్యవేక్షణ కొనసాగేలా చర్యలు చేపట్టామన్నారు. పులులు కొత్త ప్రాంతాల్లో సంచరించేందుకు ఇష్టపడతాయన్నారు.
రైతులు కొన్ని రోజులపాటు వ్యవసాయ పనులకు ఉదయం 10 గంటలకు వెళ్లి సాయంత్రం 4 గంటలకే ఇంటికి చేరుకోవాలని, సరిహద్దులోని ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కర్రకు గజ్జెలు బిగించుకుని చేతిలో పట్టుకుని శబ్దం చేస్తూ, ఈలలతో చప్పుడు (విజిల్), కేకలు వేస్తూ, బృందంగా వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లొద్దన్నారు. అలాగె పంటల రక్షణకు విద్యుత్తు కంచెలు ఏర్పాటు చేయొద్దని, వన్యప్రాణులకు హాని కలిగించొద్దని, పశువులను సైతం అటవీ ప్రాంతం వైపు మేతకు తీసుకెళ్లొదన్నారు. కోడెదూడ యజమానికి పరిహారం అందేలా చర్యలు చేపడతామన్నారు. పులి పాదముద్రల ఆనవాళ్లు కనిపిస్తే, ఏదైనా ఘటన చోటు చేసుకుంటే అధికారులకు సమాచారమివ్వాలని గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.