జనగామ: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఫ్యామిలీపై మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. పదేళ్లలో మాజీ మంత్రి కేటీర్ ఫ్యామిలీకి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పి పాదయాత్రకు వెళ్ళాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాను ఒక్కడే నిజాయితీపరుడు అన్నట్లుగా మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు.  


కల్వకుంట్ల ఆస్తులు ఎలా పెరిగాయి?


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ, కులగణ సర్వే (Family Survey)పై జనగామ కేంద్రంలో శనివారం నాడు నిర్వహించిన సమావేశంలో కడియం శ్రీహరి ప్రసంగిస్తూ బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు అంటే 2014 ఎన్నికల అఫిడవిట్ లో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని ఉన్నాయో.. 2023 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు బయటపెట్టాలన్నారు. ఈ పదేళ్ల కాలంలో వేలకోట్ల ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఏ వ్యాపారం చేశారు, ఏ వ్యవసాయం చేసి కేటీఆర్ అంత సంపాదించారో ఆ మంత్రమేంటో, తంత్రమేంటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలంటూ సెటైర్లు వేశారు. ఈ లెక్కలు చెబితే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఇంతకీ ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతదన్నారు. ముందు మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి కేటీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.


దోపిడీ వల్లే కవిత జైలుకు వెళ్లారన్న కడియం


బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నియంత పోకడలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఈ దోపిడీ కారణంగానే కల్వకుంట్ల కవిత జైలు వెళ్లారని కడియం విమర్శించారు. పదవుల కోసం బిజెపి నాయకులు పగటి కలలు కంటున్నారని, నేతలు ఒకరిపై ఒకరు పోటీపడి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు. ఏ ఒక్కరోజు బిజెపి నాయకులు అందరూ కలిసికట్టుగా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిజెపి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి రాష్ట్ర అభివృద్ధికి గ్రాంట్ గా తీసుకొచ్చి అప్పుడు రాష్ట్ర ప్రజల ముందు మాట్లాడాలని సూచించారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.




Also Read: Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!