IND vs NZ 3rd Test Highlights New Zealand registering 3-0 win against India | ముంబై: మూడో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. స్వల్ప లక్ష్యం అయినా భారత బ్యాటర్లు విఫలం కావడంతో స్వదేశంలో మరో ఓటమి తప్పలేదు. దీంతో టెస్టు సిరీస్ లో భారత్ ను న్యూజిలాండ్ ఆడిన మూడు టెస్టుల్లోనూ ఓడించి 3-0తో వైట్ వాష్ చేసింది. టెస్టు చరిత్రలో భారత్ గడ్డమీద వరుసగా మూడు టెస్టుల్లో ఓడటం ఇదే తొలిసారి. కాగా టెస్టు చరిత్రలో భారత్ లో సిరీస్ లో ఆడిన 3 లేదా అంతకంటే ఎక్కువ ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ భారత్ ఓడటం ఇదే తొలిసారి. ఇదివరకే 12 ఏళ్ల తరువాత భారత్ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. చివరి టెస్టులోనైనా నెగ్గి రోహిత్ శర్మ సేన వైట్ వాష్ ను తప్పించుకుంటుందని భావించినా, నిరాశే ఎదురైంది. రిషభ్ పంత్ (64) హాఫ్ సెంచరీతో పోరాటం చేయకపోతే ఈ ఓటమి సైతం దారుణంగా ఉండేది. కివీస్ 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 121 పరుగులకు ఆలౌట్ కావడంతో, 25 రన్స్ తేడాతో మూడో టెస్టులో ఓటమి పాలైంది.
టెస్టుల్లో 24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా తొలిసారి వైట్ వాష్ అయింది. చివరగా 2000లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్ వాష్ ఓటమి ఎదుర్కొంది. గతంలో సచిన్ కెప్టెన్సీలో పటిష్ట దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓడిన భారత జట్టు వైట్ వాష్ కు గురైంది. కానీ అజారుద్దీన్, హ్యాన్సీ క్రానే ఫిక్సింగ్ ఉందంతంతో అది ఓ అసంబద్ధ టెస్ట్ సిరీస్ గా పరిగణిస్తారు. తాజాగా స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ పన్నెండేళ్ల తరువాత టెస్ట్ సిరీస్ కోల్పోయింది. మూడో టెస్టులో ఓటమితో కివీస్ చేతిలో 3-0 తో వైట్ వాష్ అయింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు ఆధిక్యం
ముంబై టెస్టులో నెగ్గి మానసిక స్థైర్యాన్ని తెచ్చుకుందామని చూసిన జట్టు పోరాటం చేయకుండానే కివీస్ కు సిరీస్ అప్పగించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు రాణించడంతో కివీస్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) రాణించారు. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు పడగొట్టాడు. సుందర్ 4 వికెట్లు తీయగా, అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది. శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) హాష్ సెంచరీలు చేయడం, చివర్లో వాషింగ్టన్ సుందర్ (38 నాటౌట్) మెరుపులో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
స్పిన్ కు అలనుకూలిస్తున్న వాంఖడేలో రెండో ఇన్నింగ్స్ లోనూ భారత స్పిన్నర్లు జడేజా, అశ్విన్ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ లో రాణించిన యంగ్ (51) రెండో ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. కాన్వే (22), మిచెల్ (21), ఫిలిప్స్ (26) పరుగులు చేయడంతో 174 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో జడేజా మరో 5 వికెట్ల ఇన్నింగ్స్ ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ 3 వికెట్లు, సుందర్, ఆకాష్ దీప్ చెరో వికెట్ తీశారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (1), గిల్ (1), సర్ఫరాజ్ (1)కి ఔటయ్యారు. రిషబ్ పంత్ (64) ఫియర్ లెస్ హాఫ్ సెంచరీతో భారత్ నెగ్గేలా కనిపించింది. కానీ డిఫెన్స్ ఆడిన బంతిని కీపర్ బ్లండెల్ క్యాచ్ పట్టడంతో పంత్ నిరాశగా వెనుదిరిగాడు. వెంట వెంటనే అశ్విన్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ ఔటయ్యాడు. ఈ ముగ్గురు జట్టు స్కోరు 121 వద్దే ఔట్ కావడంతో 25 రన్స్ తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. 3-0 తేడాతో భారత్ ను వైట్ వాష్ చేసింది.
స్కోర్ కార్డ్ వివరాలు..
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ - 235 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ - 262 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ - 174 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ - 121 ఆలౌట్
2000లో సచిన్ కెప్టెన్సీలో భారత్ వైట్ వాష్ ఓటమి
2000లో భారత్ స్వదేశంలో ఆడిన రెండు టెస్టుల్లోనూ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఫిబ్రవరిలో జరిగిన ఆ మ్యాచ్ లో టాస్ నెగ్గిన సచిన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. సఫారీ బౌలర్లు జాక్ కలిస్ 3-30, అలన్ డోనాల్డ్ 2-23, షాన్ పోలాక్ 243, హ్యాన్సీ క్రానే 2-26 రాణించడంతో భారత్ 225 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సచిన్ 163 బంతుల్లో 97 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా 176కే ఆలౌటైంది. కానీ రెండో ఇన్నింగ్స్ లో భారత్ 113 పరుగులకు కుప్పకూలడంతో దక్షిణాఫ్రికా 163 టార్గెట్ ను ఛేజ్ చేసింది.
మార్చిలో జరిగిన బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 158 రన్స్ చేయగా రెండో ఇన్నింగ్స్ లో 250కి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 479 పరుగులు చేయడంతో ఇన్నింగ్స్ 71 రన్స్ తేడాతో భారత్ దారుణంగా ఓటమి చెందింది. దాంతో 2-0తో భారత గడ్డమీద సఫారీలో టెస్టు సిరీస్ ను వైట్ వాష్ చేసినట్లు అయింది.