India vs New Zealand  3rd Test Highlights | ముంబై: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. టెస్టు మూడో రోజు లంచ్ సెషన్ సమయానికే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి 6 వికెట్ల నష్టానికి భారత్ 92 పరుగులు చేసింది. విజయానికి మరో 55 పరుగులు కావాలి. ప్రస్తుతం రిషభ్ పంత్ (53), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లోనూ కీలక సమయంలో బ్యాటింగ్ కు దిగిన పంత్ మెరుపు హాఫ్ సెంచరీ చేయడం తెలిసిందే. స్వల్ప లక్ష్యం కావడంతో భారత్ అదరగొడుతుందనుకుంటే కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ మరోసారి అద్భుతం చేస్తూ భారత టాపార్డర్ నడ్డి విరిచాడు.


సిరీస్ లో కివీస్ 2-0తో భారత్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో నెగ్గి వైట్ వాష్ తప్పించుకోవాలని యత్నిస్తోంది. ఇప్పటికే 12 ఏళ్ల తరువాత స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్ ఓడిపోయి విమర్శల పాలైంది. దానికి తోడూ కీలకమైన మూడో టెస్టులో భారత బ్యాటర్ల ప్రదర్శనతో ఆసీస్ గడ్డమీద ఎలాంటి ఫలితాలు వస్తాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్ గెలిచి భారత్ మళ్లీ విజయాలు అందుకోవాలని మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. అటు కోచ్ గౌతం గంభీర్ పై సైతం ఒత్తిడి పెరుగుతోంది.


స్వల్ప టార్గెట్ అయినా భారత బ్యాటర్ల తడబాటు


171/9 తో మూడో రోజులు ఆట మొదలుపెట్టిన న్యూజిలాండ్ మరో 3 పరుగులు చేసి ఆలౌటైంది. దాంతో 147 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు సరైన ఆరంభం లభించలేదు. వరుస విరామాట్లో వికెట్లు కోల్పోవడంతో ఓ దశలో భారత్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తుండటంతో కివీస్‌ స్పిన్నర్ అజాజ్‌ పటేల్ (4/30) మరోసారి భారత వెన్ను విరిచాడు. 


రోహిత్, కోహ్లీలు మళ్లీ విఫలం


కెప్టెన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (1), సర్ఫరాజ్‌ ఖాన్ (1) మరోసారి విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో 90 రన్స్ చేసి సెంచరీ చేజార్చుకున్న శుభ్‌మన్ గిల్ (1) సైతం త్వరగా వికెట్ సమర్పించుకున్నాడు. తొలి, రెండో ఇన్నింగ్స్ చూస్తే భారత్ కు బ్యాటింగ్ వచ్చా అనే తీరుగా ఆడారని క్రికెట్ ప్రేమికులు కామెంట్ చేస్తున్నారు. ఇదివరకే సిరీస్ లో దారుణమైన స్కోర్లకు భారత్ ఆలౌటైనా, తీరు మారలేదని మాజీ విమర్శిస్తున్నారు. స్వల్ప స్కోరును ఛేదించడంతో అంత తొందరెందుకు, ఆడుతున్నది భారత గడ్డపై అని మరిచిపోయారా అని ఫైర్ అవుతున్నారు.







స్కోర్ కార్డ్ వివరాలు..
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ - 235 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ - 262 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ -  174 ఆలౌట్


Also Read: Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం