Ind vs Nz 3rd Test News Updates | ముంబై: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. బౌలర్లు రాణించడంతో కివీస్ జట్టు వరుస విరామాలలో వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమానికి పర్యాటక జట్టు న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ప్రస్తుతానికి కివీస్ కు 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్పిన్నర్లు మ్యాచ్ మళ్లీ మనవైపు తిప్పేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లతో రాణించాడు. అశ్విన్ 3 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
గిల్ సెంచరీ మిస్, రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ
తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ స్కోరు 86/4 స్కోరుతో భారత్ రెండో రోజు ఆటను మొదలుపెట్టింది. గిల్ భారీ హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీలకు తోడు వాషింగ్టన్ సుందర్ (38 నాటౌట్) రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు స్వల్ప ఆధిక్యం లభించింది. వన్ డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (90 పరుగులు; 146 బంతుల్లో 7 ఫోర్లు), కీపర్ రిషభ్ పంత్ (60 పరుగులు; 59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక సమయంలో రాణించారు. 96 పరుగుల భారీ భాగస్వామ్యం తరువాత పంత్ ను ఇస్ సోదీ ఎల్బీడబ్యూ చేశాడు. అంపైర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసి రివ్యూకు వెళ్లగా, అంపైర్ కాల్ రావడంతో పంత్ నిరాశగా వెనుదిరిగాడు.
జడేజా (14) త్వరగా ఔట్ కాగా, సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. పటేల్ బౌలింగ్ లో సర్ఫరాజ్ ఆడిన బంతిని కీపర్ క్యాచ్ పట్టడంతో 7వ వికెట్ గా పెవిలియన్ చేరాడు. స్కోరు పెంచే క్రమంలో గిల్ (90) సెంచరీ మిస్ చేసుకుని ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ (38 నాటౌట్: 52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగు పెరిపించడంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అశ్విన్ (6), ఆకాష్ దీప్ డకౌట్ అయ్యాడు. ఫిలిప్స్, సోదీ, మ్యాట్ హెన్రీలు తలో వికెట్ తీశారు.
స్కోర్ కార్డ్ వివరాలు..
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ - 235 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ - 262 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ - 171/9
ఆరంభంలోనే కివీస్ కు ఎదురుదెబ్బ
రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ పేసర్ ఆకాష్ దీప్ తొలి ఓవర్ 5వ బంతికి టామ్ లాథమ్ ను ఔట్ చేశాడు. 22 పరుగులు చేసిన డేవాన్ కాన్వేను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత రవీంద్ర జడేజా, అశ్విన్ కివీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. అయితే విల్ యంగ్ (51 పరుగులు; 100 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించాడు. మిచెల్ 21, ఫిలిఫ్స్ 26 పరుగులు చేశారు. మ్యాట్ హెన్రీ (10) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరగ్గా రెండో రోజు ఆటను అంపైర్లు నిలిపివేశారు. ప్రస్తుతం అజాజ్ పటేల్ 7 పరుగులతో నౌటౌట్ గా ఉన్నాడు. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3, ఆకాశ్ దీప్, సుందర్ చెరో వికెట్ తీశారు.