Telangana RTC News Today | హైదరాబాద్‌: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా, ఆర్టీసీ సంస్థ నూతన చర్యలు చేపడుతోంది. డ్రైవర్లు సెల్‌ఫోన్‌ వాడకంతో ప్రమాదాలు సంభవిస్తున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని, వాటిని నిరోధించేందుకు సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు సెల్‌ఫోన్‌ను వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజా నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ప్రాథమికంగా, రాష్ట్రంలోని 11 రీజియన్లలో ఒక్కో డిపోను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశారు. 

ఈ ప్రాజెక్ట్‌ ఫలితాల ఆధారంగా, దశల వారీగా మిగిలిన అన్ని డిపోల్లో డ్రైవర్లకు సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం అమలు చేయనున్నారు. డ్రైవర్‌ విధుల్లో చేరేముందు, తన సెల్‌ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి, డిపోలోని సెక్యూరిటీ అధికారికి ఆఫీస్‌ వద్ద డిపాజిట్‌ చేయాలి. విధులు ముగిసిన తర్వాత మాత్రమే తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో డ్రైవర్‌ను సంప్రదించడానికి, ప్రతి డిపోలో ప్రత్యేక సెల్‌ఫోన్‌ నంబర్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ నంబరుకు కాల్‌ చేసి సమాచారం అందిస్తే, సంబంధిత బస్సు కండక్టర్‌ ద్వారా డ్రైవర్‌తో సంప్రదించే వీలుంటుంది.

సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం అమలు చేసే డిపోలు, వాటి రీజియన్లుఉట్నూర్‌ (ఆదిలాబాద్‌), కామారెడ్డి (నిజామాబాద్‌), జగిత్యాల (కరీంనగర్‌), పరకాల (వరంగల్‌) ఖమ్మం (ఖమ్మం), కూకట్‌పల్లి (సికింద్రాబాద్‌), ఫరూక్‌నగర్‌ (హైదరాబాద్‌), వికారాబాద్‌ (రంగారెడ్డి), కొల్లాపూర్‌ (మహబూబ్‌నగర్‌), సంగారెడ్డి (మెదక్‌), మిర్యాలగూడ (నల్గొండ).