Keeping Cash At Home Rules In India | ప్రస్తుతం చాలా లావాదేవీలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. విద్యుత్ బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్ నుంచి టికెట్ల వరకు దాదాపు ప్రతి పని డిజిటల్ చెల్లింపుతో పూర్తవుతుంది. అయినప్పటికీ, నగదు డబ్బుల అవసరం మనకు తొలగిపోలేదు. పెళ్లిళ్లు, వైద్య అత్యవసర ఖర్చులు, లేదా రోజువారీ ఖర్చుల కోసం ప్రజలు ఇంట్లో నగదు ఉంచుకోవడం అవసరం. లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడతాం. అటువంటి పరిస్థితిలో చట్టబద్ధంగా ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవడం సరైనది అనేదే అతిపెద్ద ప్రశ్న. 

ఇంట్లో నగదు ఉంచడానికి ఏదైనా పరిమితి ఉందా? 

ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఇంట్లో నగదు ఉంచుకోవడానికి ఎలాంటి నిర్దిష్ట పరిమితిని విధించలేదు. అంటే, మీరు కోరుకుంటే, లక్షల రూపాయలు లేదా కోట్లు రూపాయలు మీ దగ్గర నగదు రూపంలో ఉంచవచ్చు. చట్టం దీన్ని అడ్డుకోలేదు. కానీ ఇక్కడ ఒక షరతు మీరు గుర్తుంచుకోవాలి. ఈ డబ్బు చట్టబద్ధమైన మార్గంలో వచ్చిందని, అందుకు సంబంధించి మీతో ఆధారాలు ఉండాలి. 

డబ్బుకు ఆధారం ఏంటి..

మీ దగ్గర పెద్ద మొత్తంలో నగదు ఉంటే ఆదాయపు పన్ను శాఖ విచారణ చేస్తే, మీరు దానిని ఎలా పొందారో సోర్స్ చూపించాలి. ఈ మొత్తం మీకు జీతంగా వచ్చిందా, లేక వ్యాపారం, ఆస్తి అమ్మకం లేదా బ్యాంకు నుంచి తీసుకున్నారా అని చూపించాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్, అంటే బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ITR, పే స్లిప్‌లు లేదా ఆర్థిక లావాదేవీల రసీదులు మీ దగ్గర కచ్చితంగా ఉండాలి.  

చట్టం ఏం చెబుతోంది?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 నుంచి 69B వరకు, మీరు ఏదైనా మొత్తానికి సంబంధించి సోర్స్ వివరించలేకపోతే, అది అక్రమ సంపాదనగా పరిగణిస్తారు. అటువంటి సందర్భాలలో, పన్ను విధించడంతో పాటు మీకు గరిష్టంగా 78% వరకు జరిమానా కూడా విధించవచ్చు. 

మీకు ఎప్పుడు సమస్యలు వస్తాయి? 

  • ఆదాయపు పన్ను శాఖకు పెద్ద మొత్తంలో నగదు లభించిన సమయంలో మీరు దానిని రుజువులు నిరూపించలేకపోతే. 
  •  మీ ITR లేదా అకౌంట్ బుక్స్ లో నమోదు చేసిన మొత్తానికి మీ నగదుకు సరిపోకపోతే. 
  • మీరు రూ.2 లక్షలకు మించి నగదు బహుమతిని స్వీకరించినా లేదా ఆస్తి కొనుగోలు- అమ్మకంలో ఇంత నగదును వినియోగిస్తే, అది నిబంధనలను ఉల్లంఘించినట్లు పరిగణిస్తారు.

ఏ లావాదేవీలపై ఆంక్షలు ఉంటాయి

  • బ్యాంకులో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయడం లేదా ఉపసంహరణకు పాన్ కార్డ్ తప్పనిసరి 
  • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించి నగదు జమ చేస్తే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ రెండూ ఇవ్వాలి. 
  • రూ.30 లక్షలకు పైబడిన ఆస్తి నగదు లావాదేవీలపై విచారణ జరగుతుంది
  • క్రెడిట్ కార్డ్ ద్వారా 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపు కూడా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వస్తుంది 

భారతదేశంలో మీరు ఇంట్లో నగదు ఉంచుకోవడం ఏమాత్రం చట్టవిరుద్ధం కాదు. కానీ పెద్ద మొత్తంలో నగదు మీ ఇంట్లో ఉంటే కనుక అందుకు సంబంధిత పత్రాలు, ఆధారాలు ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే విచారణ సమయంలో ఇబ్బందులు, జరిమానా సైతం ఎదుర్కొంటారు.