Debate on Kaleshwaram Project Report | హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పుట్టుకతోనే దొర అని చెప్పుకునే కేసీఆర్ దోపిడి దొంగగా మారి తెలంగాణ సొత్తు లక్ష కోట్లు కొల్లగొడితే ప్రజాస్వామ్య దేశం కనుక నడి బజారులో రాళ్లతో కొట్టి చంపలేదు. ఉరి తీయలేదు. విచారణ చేసి చర్యలు తీసుకునేందుకు అభిప్రాయం కోరాం. దాన్ని మా బలహీనతగా అపహాస్యం చేశారు. భవిష్యత్ తరాలు మమ్మల్ని తప్పుపట్టకుండా ఉండాలని బాధ్యతగా వ్యవహరించాం.
కాళేశ్వరం మీద 49 వేల కోట్లు అప్పులు, కొంత అసలు చెల్లించాం. ఇంకా 47 వేల కోట్లు ఉంటే ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రాజెక్టుల అప్పులపై బారం తగ్గించేందుకు నేను ఢిల్లీకి వెళ్లాను. ప్రధాని మోదీని కలవడం వల్ల 26500 కోట్లను 11.9 రేట్ వడ్డీకి కేసీఆర్ తెచ్చిన అప్పును 7.25 శాతానికి తగ్గించి 30 ఏళ్లకు పొడిగించి డెట్ రీస్ట్రక్చర్ చేపించా. ఏడాదికి రూ.4 వేల కోట్లు ఆదా అవుతుంది. 30 ఏళ్లకు లక్షా 20 వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరానికి ఏడాదికి రూ.13 వేల కోట్లు ఆదా అవుతుంది.
ఎక్కువ సంపాదించాలని నేతల నిర్ణయాలతో ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా, ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అంశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి, అవకతవకల అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని, తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరినీ వదిలేది లేదు. అవినీతిపరులపై చర్యలకు సరైన నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్నాకే ఇక్కడి నుంచి బయటకు వెళతాం. నిజాం ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరు కాగా, గత బీఆర్ఎస్ పాలకులు అంబానీ, అదానీ కంటే ఎక్కువ సంపాదించాలనే ఆశతో సొంత నిర్ణయాలతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టారని” తీవ్ర విమర్శలు చేశారు.
‘‘లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. నీటి కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. బంగారం కంటే నీరు మాకు ముఖ్యమైంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లపై ఇప్పటికే విచారణ చేపట్టాం. జస్టిస్ పీసీ ఘోష్ అనుభవం ఉన్న న్యాయమూర్తి. అనేక తీర్పులు ఇచ్చిన ఆయనకు కాగ్, విజిలెన్స్, ఇతర దర్యాప్తు సంస్థల నివేదికలు అందించాం. ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తున్నాం'' అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
అవినీతిపరులపై చర్యలు తప్పవు
అక్బరుద్దీన్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, “కాళేశ్వరం నివేదికను పూర్తిగా చదవకుండానే మాపై ఆరోపణలు చేయవద్దు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ నివేదికలను కూడా కమిషన్‌కు అందించాం. కమిషన్ అందరి నుండి వివరాలు సేకరించి రిపోర్ట్ ఇచ్చింది. కనుక వాస్తవాలు వక్రీకరించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. మీ సూచనలు, సలహాలు తీసుకోవడానికి కమిషన్ రిపోర్ట్ మీ ముందుంచాం. అవినీతిపరులపై కఠిన చర్యలు తప్పవు. ప్రతి విషయం నివేదికలో ఉండకపోవచ్చు. అక్బరుద్దీన్ ఒవైసీ నాకు మిత్రుడు కావచ్చు, నామీద జోకులు వేయొచ్చు, కానీ ప్రభుత్వంపై జోకులు వేయడం సరికాదని’’ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
జస్టిస్ ఘోష్ కమిషన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి “8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వలేదని కేసీఆర్, హరీశ్ రావు కోర్టును ఆశ్రయించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని పిటిషన్ వేశారు. కమిషన్‌పై కూడా కోర్టుకు వెళ్లారు. వారు ఇప్పటివరకు 8బీ, 8సీ ప్రకారం నోటీసులు ఇచ్చామని కోర్టులో చెప్పినవారే. అవినీతి సొమ్మును రికవరీ చేయాలంటే ఏ సంస్థ ద్వారా చేయాలో సిట్ వేయాలా లేక సీఐడీ, ఐటీ, ఈడీ, సీబీఐ ద్వారానా అని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం” అన్నారు.
కాంగ్రెస్ గత ప్రభుత్వం నిర్ణయం మేరకు తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించుకుని నాలుగు ప్యాకేజీల కింద 1.60 లక్షల ఎకరాలకు నీళ్లు అందించుకుని.. శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్లు నింపుకుంటూ నీటిని తరలించుకుపోతే 16 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు, హైదరాబాద్ కు తాగునీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదన్నారు. తుమ్మిడిహట్టి లిఫ్ట్ 19 మీటర్లు అయితే హరీష్ రావు 38 మీటర్లు అన్నారు. తుమ్మిడిహట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవచ్చే అని సూచించినా.. కానీ కేసీఆర్ మేం మేడిగడ్డ వద్ద బ్యారేజీ కడతామని చెప్పి అడిగితే వాప్కోస్ అందుకనుగుణంగా నివేదిక ఇచ్చిందన్నారు. తరువాత అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు కడతామని చెబితే అందుకు తగ్గట్లుగా వ్యాప్కోస్ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.
కమీషన్ల కోసం ప్రాజెక్టును మార్చారు..
కమీషన్ల కోసం పై నుంచి కిందకు రావాల్సిన నీళ్లను, మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి కింద నుంచి పైకి ఎన్నో లిఫ్టులు ద్వారా ఎత్తిపోశారు. 3400 మెగావాట్ల యూనిట్ల అవసరం పడేచోట బీఆర్ఎస్ నిర్ణయాలతో 8400 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ కు పెరిగిందన్నారు. కాంట్రాక్టర్ల కోసం లిఫ్టులు పెరిగాయి. 162 టీఎంసీల నీరు మాత్రం పెరగలేదు. 38 వేల కోట్లతో పోవాల్సిన ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా చేసి ఏకంగా ఒక లక్షా 47 వేల కోట్లకు ఖర్చు పెరిగిందని రేవంత్ ఆరోపించారు. అత్యంత నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్డీఎస్ఏ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను గుర్తించింది. ఇంజినీర్ల నిర్ణయాలు కాకుండా, నేతలు తీసుకున్న నిర్ణయాలే ప్రాజెక్టులో లోపాలు, అవకతవకలకు కారణమయ్యాయని రేవంత్ విమర్శించారు.