Mancherial News Today | చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇటీవల జరిగిన ఎస్.బి.ఐ బ్యాంకు భారీ స్కాం ను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్.బి.ఐ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేసే నగిరే రవీందర్ తో పాటు బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్ లతోపాటు 41 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 15 కిలోల బంగారు ఆభరణాలు, 1,61,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిపి పేర్కొన్నారు. గత కొంతకాలం నుంచి బ్యాంకులో పని చేసే ఉద్యోగులే ఈ భారీ స్కాం కు పాల్పడినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
గత కొంతకాలం నుంచి బ్యాంకులో క్యాషియర్ నగిరె రవీందర్ ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడి 40 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు బ్యాంకులో ఉన్న మరో ఇద్దరితో కుమ్మక్కై కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఖాతాదారులకు సంబంధించిన గోల్డ్ విషయంలో తేడాలు రావడంతో ఎస్.బీ.ఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోట్లాది రూపాయల స్కాం బయటపడింది.
ఇదంతా ఇంటి దొంగల పనే అని గమనించిన పోలీసు ప్రత్యేక బృందాలతో 44 మందిని పపట్టుకున్నారు. మరి కొంత బంగారు ఆభరణాలతో పాటు నగదును రికవరీ చేస్తామని సిపి పేర్కొన్నారు. అలాగే మరికొందరిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్కాం ను ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
బ్యాంకు చోరీలో సూత్రధారులు అరెస్ట్.. ఖాతాదారులు సంబరాలు..రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ చెన్నూరు SBI బ్యాంక్ ఎదుట మోసపోయిన ఖాతాదారులు సంబరాలు చేసుకున్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినందుకు బ్యాంక్ ఎదుట బాణసంచా కాల్చి, పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తమ బంగారం తిరిగి రికవరీ చేయడానికి కృషి చేసిన రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీ, జైపూర్ ఏసీపీ, చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ సబ్ డివిజన్, కమీషనరేట్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.