Debate on Kaleshwaram Project report | హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన సమావేశాలు అన్నింటికన్నా ఈ సమావేశాలు కొంత ప్రత్యేకమనే చెప్పాలి. అందుకు కారణం ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు ఒక ఎత్తయితే, ఈ సమావేశాలకైనా బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరు అవుతారా లేదా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ రోజు (ఆదివారం) శాసనసభలో కాళేశ్వరంపై చర్చ పెడతామని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. చర్చ సందర్భంగా తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం డిమాండ్ చేస్తోంది.

Continues below advertisement

అయితే, ఈ రోజు చర్చలో కేసీఆర్ పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిటీ నివేదికపై స్పందిస్తారా, లేక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావులే శాసనసభలో కథంతా నడిపిస్తారా అన్నది ఇప్పుడు అందరిలో ఉన్న ఉత్కంఠ. అయితే, కేసీఆర్ వ్యూహచతురత ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

కేసీఆర్ శాసనసభకు హాజరు అవుతారా? లేదా?

Continues below advertisement

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు మూడు సార్లు మాత్రమే శాసనసభకు హాజరయ్యారు. అది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోను, ఇక బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం సమయంలో మాత్రమే హాజరయ్యారు. ఇక శాసనసభ సమావేశాలన్నింటినీ అటు కేటీఆర్, ఇటు హరీశ్ రావులే అంతా తామై నడిపిస్తున్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారాలన్నింటినీ పార్టీ సీనియర్లుగా కేటీఆర్, హరీశ్ రావులు నడుపుతున్నా, మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరు కాకపోవడం పట్ల అటు అధికార పక్షంలోనూ, ఇటు బీఆర్ఎస్ పార్టీలోనూ పాజిటివ్‌గాను, నెగటివ్‌గాను చర్చలు సాగుతున్నాయి.

అయితే, కేసీఆర్ మాత్రం తనదైన శైలిలో అసెంబ్లీకి హాజరుకాకుండానే రాజకీయాలు నెరపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సమావేశాల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా అమలు చేయాలన్న అంశంపై చర్చ జరగనుంది. అయితే ఈ అంశంపై కేవలం బీజేపీ తప్ప మిగతా అన్ని పార్టీలదీ ఏకాభిప్రాయమే. బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్లను కలపడం పైనే తన వ్యతిరేకతను ప్రకటిస్తుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధిని తప్పుబట్టే అవకాశం మాత్రం ఉందని చెప్పాలి.

సభలో చక్రం తిప్పేది వారిద్దరేనా?

అయితే, వాడివేడిగా చర్చ జరిగేది మాత్రం ఈ రోజు సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కాళేశ్వరం కమిటీ ఇచ్చిన నివేదికపైనే. ఈ అంశంపై గతంలో మాదిరిగానే కేటీఆర్, హరీశ్ రావులతో సభలో రాజకీయం నడుపుతారా, లేక కేసీఆర్ స్వయంగా ఈ అంశంపై చర్చించేందుకు రంగంలోకి దిగుతారా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే, కేసీఆర్ రాజకీయ చతురత గమనిస్తే తాను స్వయంగా ఈ సమావేశాలకు హాజరు అయ్యే అవకాశాలు తక్కువ. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రుల ప్రశ్నలకు సభా వేదికగా కేసీఆర్ స్వయంగా సమాధానాలు ఇవ్వడం అన్నది జరిగేపని కాదని కేసీఆర్ రాజకీయాలను స్వయంగా చూసిన వారికి అర్థమయ్యే విషయం.

కాళేశ్వరం విషయంలో టెక్నికల్‌గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు హరీశ్ రావు, రాజకీయంగా మాట్లాడాల్సిన సందర్భంలో కేటీఆర్‌లు మాత్రమే స్పందించే వ్యూహంతో బీఆర్ఎస్ ఈ శాసనసభలో వ్యవహరించే అవకాశాలే ఎక్కువ. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం తమకు ఇవ్వాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. అయితే అలాంటి సంప్రదాయం సభలో లేదని, గతంలో తాము అడిగితే కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించలేదని అధికార పార్టీ మంత్రులు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అనుమతి ఇచ్చినా హరీశ్ రావే చర్చను ముందుకు నడిపించే అవకాశాలు ఎక్కువ.

కేసీఆర్ సభ హాజరు విషయంలో రాజకీయంగా లాభనష్టాలేంటో చూద్దామా?

కాళేశ్వరం చర్చలో కేసీఆర్ పాల్గొంటే శాసనసభలో చర్చ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. తన డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలను కేసీఆరే స్వయంగా తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశం లభిస్తుంది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు మంచి అవకాశంగా చెప్పవచ్చు. అధికార పార్టీ చేస్తోన్న ఆరోపణలను స్వయంగా సభా వేదిక ద్వారా తిప్పికొట్టే అవకాశం కలుగుతుంది. కేసీఆర్ స్వయంగా ఈ అంశంపై మాట్లాడటం వల్ల ప్రజల్లో ఆయనకు పరపతి లభించవచ్చు. పార్టీ చీఫ్‌గా తనపై వచ్చిన ఆరోపణలను స్వయంగా కేసీఆర్ తిప్పికొట్టడం వల్ల, క్యాడర్‌లో ఉన్న నిరుత్సాహం పోయి, రానున్న రోజుల్లో ఉత్సాహంగా అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కొనే నైతిక బలం వారికి లభిస్తుంది. ఇది కేసీఆర్  శాసన సభ చర్చలో పాల్గొనడం వల్ల కలిగే  లాభంగా చెప్పవచ్చు.

ఇక నష్టం ఏంటంటే, తనపై స్వయంగా వచ్చిన ఆరోపణలను కేసీఆర్ ఎదుర్కోవడంలో ఏ తప్పు జరిగినా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద నష్టం తప్పదు. ఇక చర్చకు కేసీఆర్ వస్తే తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ బయటపెడతామని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో కూడా కేసీఆరే ఈ ప్రాజెక్టు వైఫల్యానికి ప్రధాన కారకుడని తేల్చిచెప్పింది. ఈ నివేదికతో పాటు మరి కొన్ని ఆధారాలను సభలో పెట్టి కేసీఆర్ నేరుగా సమాధానం ఇవ్వాలని అధికార పక్షం ప్రశ్నలు సంధిస్తే రాజకీయంగా కేసీఆర్ ఇరుకున పడే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ సభలో పాల్గొంటే ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఖాయం. అదే జరిగితే అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన, పార్టీ చీఫ్ కేసీఆర్ పైన రాజకీయంగా పైచేయి సాధించినట్లు అవుతుంది. ఇది గులాబీ పార్టీకి మైనస్‌గా చెప్పవచ్చు.  ఈ చర్చలో కేసీఆర్ స్వయంగా పాల్గొనడం అనేది కాంగ్రెస్  ఓ  ఆయుధంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదు.  అలాంటి అవకాశం కేసీఆరే, స్వయంగా కాంగ్రెస్ కు ఇచ్చినట్లు అవుతుంది.  కేసీఆర్ సభకు రావడం వల్ల గులాబీ పార్టీకి కలిగే నష్టంగా ఇది చెప్పవచ్చు.

శాసనసభా వేదికగా ఇలాంటి చర్చలో పాల్గొనడం కన్నా, సభకు దూరంగా ఉండి, బయట వేదికల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేసే ఆరోపణలపై స్పందించడాన్ని కేసీఆర్ ఇష్టపడతారని చెప్పవచ్చు. శాసనసభలో చూపించే కాంగ్రెస్ ప్రభుత్వం చూపించే ఆధారాలపైన నేరుగా తన స్పందనను శాసనసభ ద్వారా కాకుండా మరో వేదిక ద్వారా ప్రజలకు వివరించే అవకాశాన్నే కేసీఆర్ ఎంచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.