Telangana Elections 2023 News: ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మీడియాలో కాంగ్రెస్ ప్రచార ప్రకటనలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్రకటనలపై బ్యాన్ విధించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఓటమి భయం పట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఒత్తిడితోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. 


అసలే ఎన్నికల్లో సోషల్ మీడియా వినియోగం అత్యధిక స్థాయికి చేరుతున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన సూటిగా ప్రకటనలను తయారు చేయించింది. ఏకంగా గులాబి రంగు కారుతో ప్రచార చిత్రాలను, వీడియోలను తయారు చేయించి ఆ పార్టీని ఓడగొట్టాలనే లక్ష్యంతో కారుకు పంక్చర్లు చేసి తోసేయడం లాంటి దృశ్యాలు దాదాపు అన్ని ప్రకటనల్లోనూ కనిపిస్తోంది.


బీఆర్ఎస్ పార్టీ నేతలు అభ్యంతరాలు పెట్టే స్థాయిలో ఈ యాడ్స్ ఉంటున్నాయని వారు ఫిర్యాదు చేశారు. సీఈవో వికాస్ రాజ్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ యాడ్స్‌ను నిలిపేయాలని అన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానెళ్లకు బహిరంగ లేఖ రాసింది. 


వైరల్ అవుతున్న కాంగ్రెస్ ప్రకటనలనే మరోసారి కొన్ని మార్పులతో కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో రీ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పైన బ్యాన్డ్ అని వేసింది. ఆ ప్రకటన చిత్రీకరణ సమయంలో ఎవరి భావోద్వేగాలు గాయపడలేదని, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని పేర్కొంది. కేవలం బీఆర్ఎస్ భావోద్వేగాలు తప్ప మరెవరికీ ఇబ్బంది లేదని క్యాప్షన్ పెట్టింది.