తెలుగు అకాడమీ ఫిక్స్​డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో ప్రధాన సూత్రధారికి సహకరించిన ఆరోపణలపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలి, ఏపీ మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వేదుల పద్మావతి, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ సయ్యద్‌ మొహియుద్దీన్‌లను హైదరాబాద్‌లో, ఛైర్మన్‌/ఎండీ బీవీవీఎన్‌ సత్యనారాయణరావును విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.



తెలుగు అకాడమీ తన నిధులను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసింది. ఈ లావా దేవీలను దళారులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులు నడిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి పేర్లు, వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.   పక్కా ప్రణాళిక ప్రకారం నిధులు కొల్లగొట్టినట్టు తేల్చారు. యూబీఐ బ్యాంకు మేనేజర్‌, ఏపీ మర్కంటైల్‌ క్రెడిట్‌ సొసైటీకి ఇందులో వాటా ఉందని దర్యాప్తులో బయటపడింది. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.


సిద్ధి అంబర్‌బజార్‌లోని ఏపీ మర్కంటైల్‌ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌లో తెలుగు అకాడమీ పేరుతో ఖాతా తెరిచారు. ఆ సమయంలో నకిలీ గుర్తింపుకార్డులు, ఫోర్జరీ పత్రా లు సమర్పించారు. వాటి ఆధారంగా యూబీఐ కార్వాన్‌ బ్రాంచ్‌లోని రూ.43 కోట్లు, సంతోష్‌నగర్‌ బ్రాంచ్‌లో రూ.10 కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంక్‌ బ్రాంచ్‌లో రూ.11 కోట్లు లిక్విడేట్‌ చేశారు. తర్వాత తెలుగు అకాడమీ పేరుతో సొసైటీలో తెరిచిన ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేసేశారు. సొసైటీకి 10 శాతం వరకు కమీషన్‌ ఇచ్చారు. 
 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ గత నెల 14న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్‌ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.


 


Also Read: Mumbai Rave Party: సముద్రం మధ్యన షిప్‌లో సోదాలు ఎలా? అధికారులు అమలు చేసిన పక్కా ప్లాన్ ఏంటంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి