Telangana Temperature: తెలంగాణ రాష్ట్రం ఎండలకు మండే అగ్నిగోలంలా మారుతోంది. భానుడు ఉదయం 6.30 నుంచే నిప్పులు చెరుగుతున్నాడు. బయటకు రావాలంటేనే జంకేలా భయపెడుతున్నాడు. ఎండలకు పనులకు వెళ్లేందుకు సైతం ప్రజలు ఆలోచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఇంటికే పరిమితం అవుతున్నారు. భానుడి భగ భగలకు రాష్ట్రంలో ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బకు గురై 13 మంది మృత్యువాత పడ్డారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు
రాష్ట్రంలో ఎండ వేడికి తాళలేక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన జన్ను ఎల్లమ్మ (50), ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన దామెర రాంబాబు(48) వడదెబ్బకు గురై మరణించారు. అదేవిధంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య (74) పందులు మేపడానికి వెళ్లి వడదెబ్బ తగిలి మృతిచెందాడు.
పిట్టల్లా రాలుతున్న మనుషులు
నల్లగొండ జిల్లాలోని అనుముల మండలంలోని కొత్తపల్లికి చెందిన బచ్చు ముకుందరెడ్డి(55) వ్యవసాయ పనిముట్ల కోసం శక్రవారం ఉదయం బైక్‌పై నల్లగొండ పట్టణానికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో ఏపీకి చెందిన కూలి వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన కర్రి రాజు(40), భార్య దీనమ్మ తమ ముగ్గురు పిల్లలతో కలిసి దుబ్బాకలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిట్యాల బస్టాండ్‌లో రామన్నపేటకు వెళ్లేందుకు రాజు బస్సుకోసం ఎదురుచూస్తూ వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. మనుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (28) ఉపాధి పనికి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయింది. తోటి కూలీలు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది.
నీళ్ల కోసం వెళ్లి మృత్యువాత
మధ్యప్రదేశ్‌కు చెందిన జాకీర్ హు స్సేన్(60) కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని బసంత్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సిమెంట్ లోడ్‌తో చొప్పదండికి వచ్చాడు. ప్రధాన రహదారిపై ఓ హోటల్ సమీపంలో లారీని ఆపి మంచినీటి కోసం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి వచ్చి హుస్సేన్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీ దుర్గం భీమయ్య(55) పొలం పనులకు వెళ్లి వడదెబ్బతో మృతి చెందాడు.
గుర్రంపోడుకు చెందిన రేపాక ముత్తమ్మ(64) ఎండల వేడిమికి తాళలేక వడదెబ్బకు గురై మరణించింది. ధాన్యం విక్రయించేందుకు వెళ్లి ఐకేపీ కేంద్రం వద్దే ఉంటున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం హజీపూరకు చెందిన మల్లీ కల్పన(24) వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచింది. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన కళ్యాణం రామక్క (75), పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్కు చెందిన ఈదునూరి కిషోర్(34), ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగోబా తండాకు చెందిన ఆత్రం లింబారావు(23) వడదెబ్బ తగిలి మరణించారు.
గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతవారణ శాఖ శుభవార్త చెప్పింది. శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. శనివారం రాష్ట్రంలోని నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని సూచిస్తూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.