Temperature in Hyderabad | హైదరాబాద్: ఈ ఏడాది భానుడు మరింత ప్రతాపం చూపనున్నాడని వాతావరణ కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎండలు చూసి బెంబెలెత్తిన తెలుగు ప్రజలకు అనంతరం మూడు వారాలు సాధారణ ఉష్ణోగ్రతలు చూశారు. కానీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు నెలలు ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని ప్రజలు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు, వైద్య నిపుణులు సూచించారు. ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ఏడాది సైతం నిప్పులకొలిమే..
గత ఏడాదే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు చూసిన భారత ప్రజలు ఈ ఏడాది అంతకుమించి ఎండలు ఉంటాయన్న వాతావరణ కేంద్రం ప్రకటనతో ఆందోళన నెలకొంది. ఈ ఎండలకు ఫ్యాన్, కూలర్లు కాదు ఏసీలే ఆప్షన్ అని ప్రజలు భావిస్తున్నారు. సమ్మర్ స్టార్ట్ కాగానే ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. వాటి ధరలు సైతం అనూహ్యంగా పెరిగిపోయి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. గత 100, 125 ఏళ్లలో సగటు ఉష్ణోగ్రతల కంటే ఈ సమ్మర్ లో ఎక్కువ ఎండలు చూస్తారని ప్రజల్ని అలర్ట్ చేశారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రివేళ సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల మేర పెరిగి ఉక్కపోత ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. గాలిలో ప్రతి ఏడాది తేమ తగ్గిపోతోందని, ఓజోన్ పోర మరింత విచ్ఛిన్నం అవుతుండటం అందుకు ప్రధాన కారణం.
తెలంగాణలో వెదర్ అప్‌డేట్తూర్పు, ఉత్తర తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ నిపుణులు అంచనా వేశారు. తూర్పు తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు ఉండవచ్చు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎండ మంట తప్పదు. నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీల వరకు పెరుగుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 36- 37 డిగ్రీల వరకు నమోదు కానుందని, నగర వాసులు ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వెదర్..ఏపీలోనూ గత కొన్నేళ్లుగా ఎండలు మండిపోతున్నాయి. అసలే తీర ప్రాంతం అధికంగా ఉన్న కారణంగా, ఎండలతో పాటు తీర ప్రాంతాల్లో ఉక్కపోత అధికం కానుంది. మధ్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు ఉండవచ్చు. అటు నంద్యాల, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 38 డిగ్రీల కంటే ఎక్కువ నమోదు కానుంది. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 32- 33 డిగ్రీల వరకు ఉండవచ్చు. కానీ ఉక్కపోతతో ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారు.