రాష్ట్రంలో తొలిదశలో మూడు ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయాల నిర్మాణం కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ఈ నెలాఖరులోగా తుది నివేదిక ఇవ్వాలని పౌర విమానయాన సంస్థ(ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా-ఏఏఐ)కు స్పష్టంచేసింది.  తెలంగాణలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉడాన్‌ పథకం కింద 6 ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో మామునూరు(వరంగల్‌), జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌), బసంత్‌నగర్‌(పెద్దపల్లి)పై దృష్టిపెట్టింది. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలో విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 


Also Read: వాగులో బాలురు గల్లంతు.. ఐదుగురి మృతదేహాల వెలికితీత, మంత్రి కేటీఆర్ ఆవేదన


అంచనా వ్యయాలను సవరించాలి


మామునూరు, బసంత్‌నగర్‌లలో రన్‌వేకు అవసరమైన ఎయిర్‌ స్ట్రిప్స్‌ అందుబాటులో ఉన్నా... వినియోగంలో లేకపోవడంతో అవి దెబ్బతిన్నాయి. జక్రాన్‌పల్లిలో పూర్తిస్థాయి విమానాశ్రయం నిర్మించాల్సి ఉంది. రెండో దశలో ఖానాపూర్‌(ఆదిలాబాద్‌), గొల్లగూడెం-పేటచెరువు(భద్రాద్రి-కొత్తగూడెం), గుడిబండ(మహబూబ్‌నగర్‌)లపై నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐను కోరింది. ఈ ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలకు సంబంధించి ఏఏఐ గతంలో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి రద్దీ అంతగా ఉండని కారణంగా దశలవారీగా వాటిని విస్తరించేలా వ్యయాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.


Also Read: ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్


ఏఏఐపై అసహనం


 ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి రూ.400-450 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఏఏఐ నుంచి నివేదిక వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించి నిధులు కోరాలని అధికారులు యోచిస్తున్నారు. ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ నుంచి ఆశించినంత వేగంగా స్పందన రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ఏఏఐ ఛైర్మన్‌ సంజీవ్‌కుమార్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు.


Also Read: రాజ్యసభ సభ్యుడ్ని ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్ ! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ మార్క్...


Also Read:  వరంగల్ నుంచి త్వరలో విమాన సర్వీసులు... అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రానికి కేంద్ర పౌరవిమానయానశాఖ లేఖ...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి