అల్జీమర్స్ తో బాధపడుతున్న ఎంతో మందికి ఇది ఊరటనిచ్చే వార్త. ఇంతవరకు మతిమరుపు వ్యాధికి మంచి చికిత్స, మందుల్లాంటివేవీ లేవు. ఆ వ్యాధిని అంత సీరియస్ గా కూడా చాలా మంది తీసుకోరు. కానీ  ఆధునిక కాలంలో అల్జీమర్స్ అనేక మందిపై దాడి చేస్తోంది. దీనివల్ల సాధారణ జీవితానికి దూరమై, ఇంట్లో వారికి భారమై, నలుగురిలో నవ్వులపాలవుతూ... ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది బతికేస్తున్నారు. వారందరికి ఊరట కలిగించేలా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టారు. బ్రిటన్, జర్మనీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. అలాగే ఓ కొత్త ఔషధాన్ని కూడా కనిపెట్టారు. ఈ వ్యాక్సిన్, ఔషధం మార్కెట్లోకి రావడానికి కాస్త సమయం పడుతుందని, కానీ కచ్చితంగా అల్జీమర్స్ వ్యాధిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. 


ఎలా పనిచేస్తుంది?
మన మెదడులోని ప్లేక్స్ అని పిలిచే ఫలకాలలోని కణాలు అతిగా కుచించుకుపోవడం, కొన్ని మెదడు కణాలు మరణించడం వల్ల  మతిమరుపు వస్తుంది. ఈ ప్రక్రియను ఆపడానికి అమిలోయిడ్ అనే ప్రోటీన్ శరీరంలో ఉత్పత్తి చేయాలి. అలాగని ఎక్కువగా ఉత్పత్తి అయినా కూడా సమస్యే. అమిలాయిడ్ బీటాను వ్యాక్సిన్ రూపంలో ఇచ్చి అల్జీమర్స్ కు చికిత్స చేయొచ్చని పరిశోధకులు నిర్ణయించారు. ఇది TAP01_04 రకం యాంటీబాడీలు శరీరంలో ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తుంది. ఈ యాంటీ బాడీలు మెదడు కణాలను  చనిపోకుండా కాపాడడంతో పాటూ, రిపేర్ కూడా చేస్తాయి. 


పరిశోధకులు తయారుచేసిన ఔషధం, వ్యాక్సిన్... రెండూ మెదడులోని న్యూరాన్ల పనితీరును పునరుద్ధరించడానికి, మెదడులో గ్లూకోజ్ జీవక్రియను పెంచేందుకు, జ్ఞాపకశక్తిని పునరుద్ధరించడానికి సహకరిస్తాయి. అలాగే మెదడులో అమిలాయిడ్ బీటా ఫలకాలు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి.  దీనివల్ల అల్జీమర్స్ తగ్గుతుంది. ఈ వ్యాధి లేనివాళ్లు వ్యాక్సిన్ రూపంలో దీన్ని తీసుకోవచ్చు. ఇంకా కొన్ని ట్రయల్స్ జరగాల్సి ఉంది. ఆ తరువాత ప్రభుత్వం ఆమోదం లభిస్తే మార్కెట్లోకి వ్యాక్సిన్, ఔషధం రెండూ అడుగుపెడతాయి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: గర్భం రాకపోయినా... గర్భం ధరించినట్టు అనిపించే లక్షణాలు, నమ్మి మోసపోకండి