Samsad Adarsh Gramin Yojana : కేంద్ర ప్రభుత్వం సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో టాప్ 20లో 19 తెలంగాణ గ్రామాలు సత్తాచాటాయి. తెలంగాణ గ్రామాలు సంసద్ ఆదర్శ్ గ్రామా యోజనలో అవార్డులు గెలుచుకోవడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన పల్లెప్రగతితో దేశవ్యాప్తంగా తెలంగాణ పల్లెలు మెరిశాయని ట్వీట్ చేశారు. 


టాప్ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణవే 


సంస‌ద్ ఆద‌ర్శ గ్రామీణ యోజ‌న (ఎస్ఏజీవై) టాప్ 10లో ప‌ది గ్రామాలు తెలంగాణకు చెందినవి ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టాప్ 20లో 19 తెలంగాణ గ్రామాలు ఉండడం రాష్ట్రానికే గ‌ర్వకార‌ణ‌మ‌న్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనకు ఇది నిద‌ర్శన‌మ‌ని తెలిపారు. ఎస్ఏజీవై టాప్ 10 ఆద‌ర్శ గ్రామాల జాబితాను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ లో షేర్ చేశారు. ప‌ల్లెప్రగ‌తి కార్యక్రమం కారణంగా ఈ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ అవార్డులు రావడంపై పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావుకు మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.


టాప్ టెన్ గ్రామాలు



  • యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామం

  • కరీంనగర్ జిల్లా కొండాపూర్

  • నిజామాబాద్ జిల్లా పల్డా

  • కరీంనగర్ జిల్లా రామకృష్ణాపూర్

  • యాదాద్రి జిల్లా కొలనుపాక

  • నిజామాబాద్ జిల్లా వెల్మల్

  • జగిత్యాల జిల్లా ములారామ్ పూర్

  • నిజమాబాద్ జిల్లా థానాకుర్ద్

  • నిజమాబాద్ జిల్లా కొకునూర్

  • కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి






గతంలో ఏడు అవార్డులు


సంసద్ ఆదర్శ్ గ్రామాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం  ఫిబ్రవరిలో విడుదల చేసిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన(SAGY) జాబితాలో గతంలో టాప్ టెన్ లో ఏడు గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి ఉన్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమంలో భాగంగా దేశంలోని గ్రామాల్లో సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, గ్రామ సంఘాల ఐక్యత, సామాజిక సమీకరణపై సహా పలు అభివృద్ధి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. గత జాబితాలో మొదటి పది స్థానాల్లో ఏడు తెలంగాణ గ్రామాలకు చోటు దక్కింది. ఆదర్శ గ్రామాల జాబితాలో కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ గ్రామం, 4వ స్థానంలో కరీంనగర్‌ జిల్లా బెజ్జంకి మండలంలోని గన్నేరువరం, 5వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని కందకుర్తి, 6వ స్థానంలో కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్నపల్లి, 9వ స్థానంలో వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్‌, 10వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లాలోని తాణాకుర్ద్‌ గ్రామాలు నిలిచాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం 5 గ్రామాలు ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. నిజామాబాద్ జిల్లాలో 3 గ్రామాలు ఉన్నాయి.