Telangana University News: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్ గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. శనివారం రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కేసం ఓ వ్యక్తి నుంచి వీసీ రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారు. 


ఈక్రమంలోనే బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. డబ్బులు ఇస్తానని చెప్పమని.. బాధితుడికి సూచించారు. బాధితుడు శంకర్ అధికారులు చెప్పినట్లుగా చేయగా.. శనివారం ఉదయం హైదరాబాద్ లోని వీసీ నివాసానికి వెళ్లి రవీందర్ గుప్తాకు డబ్బులు ఇవ్వబోయాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు వచ్చి 50 వేల రూపాయల లంచం తీసుకుంటున్న వీసీని పట్టుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు కూడా నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీసీ రవీందర్ గుప్తాను అదుపుకులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 


ఇటీవలే విజిలెన్స్ అధికారుల దాడులు


నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి సమీపంలో ఉన్న తెలంగాణ యూనివ‌ర్సిటీలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. యూనివ‌ర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భ‌వ‌నంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోప‌ణ‌ల రావడం వల్ల విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ సోదాలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. అకౌంట్ సెక్ష‌న్, ఏవో సెక్ష‌న్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్ష‌న్ల‌లో సోదాలు చేశారు. యూనివ‌ర్సిటీలోని క‌ళాశాల భ‌వ‌నాల్లోనూ విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈసీ మెంబర్లకు, వీసీకి మధ్య నెలకొన్ని గొడవలపై కూడా అధికారులు దృష్టి సారించారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్‌ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్‌ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ గందరగోళంగా మారింది. ఈసీ మెంబర్లకు, వీసీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అక్రమ నియామకాలు, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తాజాగా రంగంలోకి దిగారు.


హైదరాబాద్‌లోని రూసా భవనంలో జూన్ నెల 3వ తేదీన‌ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు, గతంలో పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకషంగా చర్చించారు. ఆ 60వ పాలక మండలి సమావేశానికి వీసీ రవీందర్‌ మరోసారి డుమ్మాకొట్టారు. వీసీ అక్రమాలు చేశారని,  దానిపై విచారణ కమిటీ వేయాలని సమావేశంలో పాలకమండలి మెంబర్లు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. వీసీ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయడం, దినసరి ఉద్యోగం కింద పని చేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి రూ.28 లక్షలు చెల్లించిన అంశాలకు సంబంధించి కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు.