Traffic E Challans:చలానాలు(Challans) కట్టించాలంటే ట్రాఫిక్ పోలీసుల(Traffic Police)కు కత్తిమీద సాము. రోడ్లపై మాటు వేసి, బైక్ లు, ఆటోలు, కార్లు ఆపి మరీ ముక్కు పిండి వసూలు చేస్తే తప్ప ట్రాఫిక్ పెండింగ్ చలానాలు వసూలు కాని పరిస్థితి. తెలంగాణ(Telangana)లో మాత్రం ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు మా పెండింగ్ చలానాలు కట్టించుకోండి మహాప్రభో అంటూ వాహనదారులు విపరీతంగా పోటీపడుతున్నారు. ఎంతలా అంటే ఒక్క నిమిషానికి ఏకంగా 1200 మందికి పైగా పెండింగ్ చలానాలు క్లియర్ చేసుకుంటున్నారు. నిమిషానికి వేలమంది చలానాలు క్లియర్ చేసుకునేందుకు ఇంతలా పోటీపడుతున్నారంటే దీనికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt), ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన బంపర్ ఆఫర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం బంపర్ ఆఫర్ మాత్రమే కాదు. ఏళ్ల తరబడి పెండింగ్ చలానాలు కట్టకుండా ఉన్నవారికి జాక్ పాట్ అనడంలో సందేహమే లేదు.


పెండింగ్ చలానుల్లో భారీ ఆఫర్ 


తెలంగాణలో 28వ ఫిబ్రవరి 2022 లోపు పెండింగ్ లో ఉన్న చలానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మార్చిలో చలానాలు విధిస్తే వాటికి ఈ ఆఫర్ వర్తించదు. అంటే గత నెలాఖరులోపు మీరు చెల్లించాల్సిన మొత్తంలో భారీ డిస్కొంట్ పొందవచ్చు. ఇంతకీ పెండింగ్ చలానాలకు ఎంత తగ్గింపు ఇస్తున్నారంటే.. ద్విచక్ర వాహనదారులు పెండింగ్ చలానా మొత్తంలో కేవలం 25 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే వెయ్యి రూపాయలు పెండింగ్ చలానాలు మొత్తం ఉంటే కేవలం రూ.250 రూపాయిలు చెల్లిస్తే చాలు. పెండింగ్ చలానుల మొత్తం క్లియర్ అయిపోతుంది. రూ. పది వేలు పెండింగ్ చలానా ఉంటే కేవలం రూ.2500 చెల్లిస్తే చాలు. ఇక కార్లు, లారీలు, జీపులు ఇలా హెవీ మోటర్ వాహనదారులైతే తాము చెల్లించాల్సిన పెండింగ్ చలానాల మొత్తంలో కేవలం 50 శాతం కడితే చాలు. ఆటో నడుపుతున్న వారు చెల్లించాల్సిన పెండింగ్ చలానాల మొత్తంలో కేవలం 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు ఆర్టీసీ బస్సు(RTC Bus) డ్రైవర్లకు సైతం చలానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు .అలా పెండింగ్ చలానాలు ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు వారు కట్టాల్సిన మొత్తంలో కేవలం 30 శాతం చెల్లిస్తే సరిపోతుంది. భాగ్యనగరంతో పాటు తెలంగాణలో అనేకచోట్ల తోపుడు బండి నడుపుకునే వారికి సైతం ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తారు. అలా పెండింగ్ చలానాలు ఉన్న తోపుడు బండి యజమానులు వారు చెల్లించాల్సిన పెండింగ్ చలానా మొత్తంలో కేవలం 20 శాతం చెల్లిస్తే ఇప్పటి వరకూ ఉన్న పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ అవుతుంది.


మొత్తం రూ.1750 కోట్లు పెండింగ్


పెండింగ్ చలానాలు చెల్లింపులో తగ్గింపు ఇవ్వడానికి ప్రధాన కారణం గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో వివిధ వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారు. వ్యాపారాలు లేక తోపుడు బండి యజమానులు ఇబ్బందులు పడితే, కనీసం ప్రయాణికులు రాక ఆటో డ్రైవర్లు(Auto Drivers) ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. ఇలా ఆర్థికంగా కుదేలైన కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు జాయింట్ కమీషనర్ రంగనాథ్. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఒక్క హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad Commissionarate) పరిధిలోనే కోటి డభై లక్షల మంది పెండింగ్ చలానాలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం అక్షరాల రూ. 600 కోట్ల రూపాయలకు పైమాటే. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే రూ.1750 కోట్లకు పెండింగ్ చలానాలు ఉన్నాయి. 


నిమిషానికి 1200 చలానులు క్లియర్ 


మార్చి నెల ఒకటో తేదీ నుంచి పెండింగ్ చలానాలపై ఆఫర్ అమల్లోకి రావడంతో చలానాలు చెల్లించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చలానుల చెల్లింపులతో సర్వర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో సర్వర్ల కెపాసిటీ, బ్యాండ్ విడ్త్ ను పదిరెట్లు పెంచారు. రోజూ లక్షలాది మంది సర్వర్లను హిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషంలో వెయ్యి నుంచి పన్నెండు వందల చలానాలు క్లియర్ అవుతున్నాయి. చాలా మందికి ఉదయం నుంచి ట్రై చేసినా దొరకండ లేదు. అంతలా స్పందన వచ్చిందని జాయింట్ సీపీ రంగనాథ్ ఏబీపీ దేశంతో అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం చాలానాలపై భారీ తగ్గింపు ఇవ్వడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  తొలిరోజు రూ.7 లక్షలకు పైగా చలానాలు క్లియర్‌ కాగా, రూ.7.5 కోట్లు వసూలు అయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం 10.5 లక్షల చలాన్లు క్లియర్‌ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.11 కోట్లు చేరాయి.