Andhra University: విశాఖ ఆంధ్ర విశ్వకళాపరిషత్(Andhra University) లో ఉద్రిక్తత నెలకొంది. ఏయూ(AU)లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు విద్యార్థి సంఘాలు చలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చాయి. ఇందుకు పోటీగా ఏయూ పరిరక్షణ పోరాట సమితి మహాధర్నా చేపట్టింది. దీంతో ఏయూ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. విశ్వవిద్యాలయం పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎటువంటి ఘర్షణ చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 



మూడు గేట్ల వద్ద విస్తృత తనిఖీలు


ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన మూడు గేట్ల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ గేట్ల గుండా కేవలం ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ఏయూ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే ఎలాగైనా చలో ఏయూ చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో తొలగించిన 20 కోర్సులను తక్షణమే పునరుద్దరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు విశాఖ(Visakha) ఆంధ్ర యూనివర్సిటీకి పలు రాజకీయ నాయకులు ర్యాలీగా తరలిరావడంతో పోలసులు వారిని అరెస్టు చేశారు. దీంతో ఏయూ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. 






నిరసనలకు అనుమతి నిరాకరణ


ఏయూలో అక్రమాలు జరుగుతున్నాయని, అవినీతి ఆరోపణలపై విచారించి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పూర్వ విద్యార్థుల సంఘాలు గురువారం చలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నెల రోజులుగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. దీనికి కౌంటర్ ఏయూ పరిరక్షణ సమితి కూడా ధర్నాకు సిద్ధమైంది. ఇరు వర్గాలు అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకోగా పోలీసులు అనుమతి తిరస్కరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. బయట వ్యక్తులు క్యాంపస్‌లోకి రావొద్దని పోలీసులు ఇప్పటికే సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Also Read: Amaravathi Case : ఏపీ రాజధాని కేసులో జగన్ ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేదా? రిట్ ఆఫ్ మాండమాస్ అంటే ఏంటి?