తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. స్వచ్ఛత విషయంలో ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు సాధించిన తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. దేశంలో ఓడీ ఫ్ ప్లస్ లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 4 తాజా సర్వేల్లో మరోసారి తెలంగాణ పేరు కొట్టేసింది. ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలు, ఇండ్ల విభాగాల్లో 100 శాతం స్వచ్చత కనబరిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వే లోనూ 100 శాతం స్వచ్ఛతను నమోదు చేసింది. దేశంలో అత్యధిక టాయిలెట్స్ ఉన్న 5 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది.


సీఎం కేసీఆర్ దార్శనికత, పల్లెప్రగతి ద్వారానే ఇది సాకారమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అవార్డు ప్రకటించిన కేంద్రానికి, సీఎం కేసీఆర్‌ కు, మంత్రులు కేటీఆర్ కు, హరీశ్ రావుకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్‌ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు. అవార్డులతో పాటు  నిధులు కూడా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు.


తెలంగాణలోని దాదాపు గ్రామాలన్నీ బహిరంగ మల, మూత్రవిసర్జన రహిత విభాగంలో చేరాయి. తాజాగా మార్చి 12, 2023 నాటికి పూర్తిచేసిన కేంద్ర ప్రభుత్వ 4 సర్వేల ప్రకారం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓ డి ఎఫ్ +), స్వచ్ఛ సర్వేక్షణ రెండు విభాగాల్లో రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల్లో నూటికి నూరు శాతం స్వచ్ఛత సాధించింది తెలంగాణ! ఈ రెండు విభాగాల్లోనూ  మొదటి 5 రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా ఉంది. ఈ విషయాన్ని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ అధికారులు గ్రామాల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల వివరాలను అప్‌డేట్ చేశారు.


ఓడీఎఫ్‌ ప్లస్‌ అంటే ఏంటి?


కేవలం మరుగుదొడ్లను నిర్మించుకుంటే ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. ఆ తరువాతి దశ అయిన ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తింపు పొందాలంటే గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించాలి. ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించాలి.  సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుల్లో తడి, పొడి చెత్తగా వేరు చేయాలి. ప్రతి గ్రామానికి చెత్తను సేకరించడానికి ట్రాక్టర్‌ సమకూర్చాలి. శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు నిర్మించడం, రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి


ఇదంతా పల్లె ప్రగతి ద్వారానే సాధ్యమైంది: మంత్రి ఎర్రబెల్లి 
రాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌ పరిధిలోకి రావడం సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతి ద్వారానే సాధ్యమైందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల వల్లే, ఈ అవార్డులు దక్కాయన్నారు. అధికారులు, ఉద్యోగులు, గ్రామపంచాయతీల సిబ్బందికి, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.


గతంలోనూ అవార్డులు 
గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఇ-పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, బహిరంగ మల,మూత్ర రహిత రాష్ట్రంగా, ఉత్తమ ఆడిటింగ్ వంటి అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా, అవార్డులు, రివార్డులు వచ్చాయి.