ఏపీలో వ్యవస్థలు దిగజారాయని మండిపడ్డారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు సంతపేట మోడల్ స్కూల్లో తన కుమార్తెతో కలసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారాయన. ఇంతవరకు తాను ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండలేదని చెప్పుకొచ్చారు. తన ఊపిరి ఉన్నంత వరకు ఓటు వేయడానికి వెనకాడబోనని చెప్పారు. ఆత్మ ప్రభోదానుసారం తాను ఓటు వేశానన్నారు ఆనం రామనారాయణ రెడ్డి.


ఎవరికీ రక్షణ లేదు.. 
ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరుని ఆక్షేపించారు ఆనం. ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు సరైన  రీతిలో లేరని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాల్సిన సందర్భంలో వారికే రక్షణ లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికలతో అందరూ నవ్వులపాలయ్యారని, ఇలాంటి ఎన్నికలు హాస్యాస్పదం అని చెప్పారు.


వ్యవస్థలు దిగజారాయి..
అధికార యంత్రాంగంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఎవరికీ రక్షణ లేదని, ఎవరికీ బాధ్యత లేదన్నారు. వ్యవస్థలన్నీ దిగజారాయని ఆరోపించారు. తాను దూర ప్రాంతంలో ఉన్నా కూడా ఓటు వినియోగించుకోవడం కోసం వచ్చానన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే బాధ కలుగుతుందన్నారు ఆనం. ఎన్నికల్లో ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. వ్యవవస్థలు నిర్మూలమవుతున్నాయని, గతంలో అనేకసార్లు తాను చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని అన్నారు ఆనం. మీడియా ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారుతున్న తీరు చూస్తుంటే బాధగా ఉందన్నారు. భవిష్యత్ తరాలకు మనమేమి ఇస్తున్నామన్న విషయాన్ని తలచుకుంటే ఆవేదన కలుగుతోందన్నారు ఆనం. ప్రజలకు అవససమైనప్పుడు గుర్తుకు వచ్చేవి రెండేనని, ఒకటి న్యాయ వ్యవస్థ అయితే, రెండోది ఎన్నికల వ్యవస్థ అని, అవే ఇప్పుడు నవ్వులపాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


అన్ని వ్యవస్థలు దిగజారుతున్నాయని, పోలీస్, ఎన్నికల అధికారులకు రక్షణ లేకుండా పోయిందని, వారే దిక్కులేని వారయ్యారని చెప్పారు. ఎన్నికలను నవ్వుల పాలు కాకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. 40 ఏళ్ల క్రితం ఎన్నికలపై ఇందిరా గాంధీ చెప్పిన మాటల్ని ఆయన గుర్తు చేశారు. ఆమె చెప్పినట్టుగా అంతరాత్మ ప్రభోదంతో ఓటు వినియోగించుకోవాలని కోరారు.


వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా ఆయన్ను పూర్తిగా దూరం పెట్టింది. అయితే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన అధికారాలకు పూర్తిగా కత్తెర పడింది. ఆయన గడప గడప కార్యక్రమానికి వెళ్లడంలేదు. ఆయన తీసుకొచ్చుకున్న అధికారుల్ని ట్రాన్స్ ఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన మాట నియోజకవర్గంలో ఏ అధికారి కూడా వినే పరిస్థితి లేదు. అందుకే ఆయన వ్యవస్థల్ని నాశనం చేశారంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. 


ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు వారి కీర్తిని ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తం చేసిందని అన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సహా.. చిత్ర యూనిట్ కి ఆయన అభినందనలు తెలిపారు. తెలుగు రానివారు కూడా నాటు నాటు పాట గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పారు.