ఏపీలో సభా సమరం మొదలు కాబోతోంది. రేపటినుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండగా.. ఈ ఏడాది వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ఉత్సాహంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు టీడీపీతోపాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టబోతున్నారు. అసెంబ్లీ వేదికగా తన పోరాటం కొనసాగుతుందన్నారాయన.


అసెంబ్లీ సమావేశాలను తెలివిగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెబల్ ఎమ్మెల్యేగా ముద్రపడిన ఆయన అసెంబ్లీలో తన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించేందుకు సిద్ధమయ్యారు. ఆ మధ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో టాక్ ఆఫ్ ఏపీగా మారిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. కొంతకాలం నుంచి స్తబ్దుగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వైసీపీకి ఆయన కౌంటర్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.


గతంలో చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు
కోటంరెడ్డి వైసీపీలో ఉండగా అసెంబ్లీలో చంద్రబాబుని ఉద్దేశించి ఘాటుగా మాట్లాడేవారు. తన స్థానాన్ని సైతం మార్చుకుని టీడీపీ నేతలకు చేరువగా కూర్చుని వారిని మాటలతో రెచ్చగొట్టేవారు. ఇప్పుడు కోటంరెడ్డి సొంత పార్టీకే చుక్కలు చూపించాల్సిన సందర్భం వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను మరోసారి ఆయన అసెంబ్లీ వేదికగా వినిపిస్తారా లేక, స్థానిక సమస్యల పరిష్కారం కోసం పట్టుబడతారా అనేది వేచి చూడాలి.


ఇన్నాళ్లూ జగన్ నమ్మినబంటుగా ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. ఇప్పుడు తొలిసారిగా జగన్ పై విమర్శలు చేసేందుకు ఆయన అసెంబ్లీని వేదిక చేసుకోబోతున్నారు. అయితే కేవలం స్థానిక రాజకీయాలు మాత్రమే మాట్లాడి, అధికారుల పనితీరుని ఎండగడతారా లేక జగన్ పై కూడా మాట తూలే అవకాశముందా అనేది వేచి చూడాలి. పార్టీకి దూరం జరిగినా ఇన్నాళ్లూ జగన్ ని పల్లెత్తు మాట అనలేదు. తనపై నమ్మకం అధిష్టానానికి లేదని, అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని, నమ్మకం లేని చోట తాను ఉండనని మాత్రమే అన్నారు. తన స్థానంలో ఆదాలను ఇన్ చార్జ్ గా ప్రకటించినా, స్థానిక సమస్యలు పరిష్కారమయితే చాలన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో తొలిసారిగా ఆయన వైసీపీకి వ్యతిరేకంగా గొంతు వినిపించడానికి సిద్ధమయ్యారు. ముందుగానే హింట్ ఇచ్చారు కాబట్టి, అసెంబ్లీలో కోటంరెడ్డి ప్రసంగాల తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి.


అసెంబ్లీ పోరాటం తర్వాత నెల్లూరులో కలుజు సమస్య పరిష్కారం కోసం జల దీక్ష చేస్తానంటున్నారు కోటంరెడ్డి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటిలో కూర్చుని జలదీక్ష చేస్తానని చెప్పారు. ప్రభుత్వానికి ఈనెల 30వరకు డెడ్ లైన్ పెట్టారు. మార్చి-30లోపు స్థానిక సమస్యలు పరిష్కరించలేకపోతే, ఏప్రిల్-6న తాను పొట్టేపాలం కలుజు వద్ద కూర్చుని నిరసన దీక్ష చేపడతానన్నారు ఎమ్మెల్యే కలుజు వద్ద ఎప్పుడూ నీటి ప్రవాహం ఉంటుంది. ఆప్రవాహం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అక్కడ ఫ్లైఓవర్ వంతెనకోసం ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో కాలేదు, వైసీపీ హయాంలో వుతుందన్న గ్యారెంటీ లేదు. దీంతో కోటంరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. కలుజు వద్ద వంతెన నిర్మాణం కోసం నీళ్లలో కూర్చుని జలదీక్ష చేపడతానంటున్నారు.