Telangana Teachers Transfers: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఆ రాష్ట్ర ఉపాధ్యాయులకు (Govt Teachers) గుడ్ న్యూస్ చెప్పనుంది. చాలా కాలంగా ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నవారికి త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ముందడుగు పడినట్లు తెలుస్తోంది. పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ఫైల్‌ను విద్యా శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆమోదం కోసం పంపించారు.
ముఖ్యమంత్రి నుంచి ఆమోదం రాగానే పదోన్నతులు, ట్రాన్స్‌ఫర్ల షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయొచ్చని అంచనా వేస్తున్నారు. సీఎం ఆమోదం తెలిపితే రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మంది టీచర్లకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది.
గత ఏడాదిలో జరగాల్సి ఉంది
వాస్తవానికి ఈ ప్రక్రియ అంతా గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరగాల్సి ఉంది. అయితే ప్రమోషన్లకు టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బదిలీలు, ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. అలాగే జీవో 317పై రంగారెడ్డి జిల్లాకు చెందిన టీచర్లు కోర్టును ఆశ్రయించారు. ఇతర జిల్లాల నుంచి టీచర్లు తమ జిల్లాలకు వస్తే తమ సీనియార్టీ దెబ్బతిని నష్టపోతున్నామని హైకోర్టుకు విన్నవించుకున్నారు. అయితే అప్పటికే మల్టీ జోన్-1 (వరంగల్) గెజిటెడ్ హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు, బదిలీలు పూర్తయింది. 782 మందికి పదోన్నతి దక్కింది.
నిలిచిపోయిన స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు
అలాగే స్కూల్ అసిస్టెంట్ల ట్రాన్స్‌ఫర్లు పూర్తయ్యాయి. కానీ వారి ప్రమోషన్లు పూర్తి కాలేదు. వాళ్లందరిని పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు, వీటితో పాటుగా ఎస్‌జీటీల బదిలీలు కూడా ఆగిపోయాయి. మల్టీ జోన్-2(హైదరాబాద్)లో కేవలం ప్రభుత్వ స్కూళల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మాత్రమే పూర్తయింది. వీరిలో 147 మందికి పదోన్నతులు లభించాయి. అలాగే స్థానిక సంస్థల (జెడ్పీ ఉన్నత) పాఠశాలల జీహెచ్‌ఎంల బదిలీలు పూర్తయ్యాయి. మిగిలినవారివి మాత్రం నిలిచిపోయాయి.
ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మొదలు
రాష్ట్రంలో ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాల సమాచారం. మల్టీ జోన్-1లో నిలిచిపోయన పదోన్నతులకు ఒక షెడ్యూలు, మల్టీ జోన్-2కు మరో షెడ్యూలు జారీ చేసే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత మార్చిలో లాంగ్వేజ్ పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్‌ల పోస్టులకు కేవలం లాంగ్వేజ్ పండిట్‌లు అర్హులని, ఎస్‌జీటీలు అర్హులు కారని కోర్టు తీర్పు చెప్పింది.
హైకోర్టు తీర్పుతో 8,630 మంది లాంగ్వేజ్ పండిట్‌లకు, 1,819 మంది పీఈటీలకు మొత్తం 10,449 మందికి ఎస్‌ఏలుగా ప్రమోషన్లు దక్కాయి. పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అయితే మల్టీ జోన్-2లో 778 మందికి గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఎస్‌జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నారు.