Telangana TDP :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై ఊహాగానాలు వస్తున్నాయి.  కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేశామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో తెలంగాణ ఎన్నికలపై మాట్లాడానని..  రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానన్నారు.  తెలంగాణలో  టీడీపీ బలంగా ఉందన్నారు.   శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 


జనసేనతో ముందుకెళ్లాలా? లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని.. ఇప్పటికే   87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని కాసాని తెలిపారు.   చంద్రబాబు ఆమోదించాక పేర్లు ప్రకటన ఉంటుందని.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా  ప్రచారం చేస్తారన్నారు.  చంద్రబాబు నాయుడు మంగళవారం బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు జ్ఞానేశ్వర్ చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.  


తెలంగాణలోనూ సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చాలా రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఖమ్మం, సికింద్రాబాద్‌లలో బహిరంగసభలు నిర్వహించారు. తెలంగాణలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను టీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పార్టీలో కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. పలువురు నేతలు పార్టీలో చేరారు అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి.. చంద్రబాబునాయును అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ  కారణమంతో టీ టీడీపీ నేతలకు ఎలా ముందుకు వెళ్లాలో తెలియకుండా ఉంది. అదే సమయంలో నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన సమయంమలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉండటంతో తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తులపై చర్చలు ఊపందుకున్నాయి.                       


తెలంగాణలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని   ప్రచారం ప్రారంభమయింది. దీనిపై పవన్ కల్యాణ్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాము 37  స్థానాల్లో పోటీ చేస్తామని ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీతో పొత్తుల గురించి కూడా పట్టించుకోలేదు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో.. టీడీపీ ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయని భావిస్తున్నారు. ఒకటి ఎన్నికలకు దూరంగా ఉండటం.. రెండు బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం. టీడీపీ పోటీ చేస్తే అది బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందని.. ఆ పార్టీని ఓడిస్తేనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కాస్తంత సహకారం లభిస్తుందన్న అంచనాలు వస్తున్నాయి. ఈ కారణంగాపోటీ చేస్తుందా లేదా అన్నదానిపై చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే కాసాని మాత్రం పోటీ ఖాయమంటున్నారు. పొత్తులపై మాత్రం ఆయనకూ స్పష్టత లేదు.