తెలంగాణ మరో అవినీతి అధికారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అడ్డంగా దొరికిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి సబ్ రిజిస్ట్రార్ రూ.20 వేలు తీసుకొనేందుకు యత్నించారు. ఇందుకోసం మధ్యవర్తిగా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్‌ నియమించారు. అతని ద్వారా లంచం డబ్బులు తీసుకొనే క్రమంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌, మధ్యవర్తి అసిస్టెంట్‌ డాక్యుమెంట్‌ రైటర్‌ ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని యాప్రాల్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ సత్యం మడే అనే వ్యక్తి 2008లో ఆలేరు మండలంలోని కొలనుపాకలో స్విస్‌ లైఫ్ గ్రీన్‌ ఎవెన్యూ టౌన్‌ షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వెంచర్‌ ఏర్పాటుచేశాడు. అందులో ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నాడు. ఈ క్రమంలోనే జులై 22న తన వెంచర్‌లోని ఐదు ప్లాట్లకు చెందిన పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. 


ఈ సందర్భంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ రూ.50 వేలు డిమాండ్‌ చేసినట్లుగా బాధితుడు తెలిపాడు. తొలుత లంచం ఇవ్వపోవడంతో 2 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి ఇంకా చేయాల్సిన మూడు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ను పక్కన పెట్టాడు. దీంతో చేసేదిలేక బాధితుడు రూ.20 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. లంచం ఇచ్చేందుకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. మధ్యవర్తి అయిన అసిస్టెంట్‌ డాక్యుమెంట్‌ ప్రభాకర్‌కు రూ.20 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌తోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా కొన్ని గంటల పాటు తలుపులు వేసి లోపల తనిఖీలు నిర్వహించారు.


ఇటీవలే ఏసీబీకి దొరికిన ఎమ్మార్వో..


ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన సంగతి తెలిసిందే. కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకోగా.. అవ్వకపోవడంతో తహసీల్దార్ సునీతను ఆశ్రయించారు. రూ.5 లక్షలు లంచం ఇస్తేనే భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తహసీల్దార్‌తో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం.. తొలి విడతగా రూ.2 లక్షలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ సునీతను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.