తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు తెరవడంపై ప్రభుత్వం నేడో, రేపో తుది నిర్ణయం తీసుకోనుంది. సెప్టెంబరు 1 నుంచి దశలవారీగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ఇప్పటికే విద్యాశాఖ ప్రతిపాదించింది. మొదటి విడతలో భాగంగా 8వ తరగతి నుంచి పీజీ వరకు.. కొన్ని రోజుల తర్వాత మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు తరగతులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నర్సరీ నుంచి రెండో తరగతి వరకూ ప్రత్యక్ష బోధనలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమావేశయ్యారు. 


రాష్ట్రంలో విద్యాసంస్థల్లో వసతులు, విద్యార్థుల సంఖ్య, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించారు. ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నిర్ణయించిన రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా వివరించారు. నిర్ణయం ప్రకటించిన తర్వాత సుమారు 15 రోజుల వ్యవధితో విద్యా సంస్థలు ప్రారంభించాలని నివేదికలో అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక కేసీఆర్ పచ్చజెండా ఊపితే మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేనందున కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. 


రెండేళ్లుగా స్కూళ్లు, కాలేజీలు లేకపోవడంతో విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సినిమా హాళ్లు, భారీ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు విద్యాసంస్థలు తెరిస్తే తప్పేముందని అంటున్నారు. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ప్రమోషన్‌ విధానం వల్ల నష్టం కలుగుతుందని వైద్య, ఆరోగ్యశాఖ అభిప్రాయపడుతుంది. ఈ విధానాల వల్ల విద్యార్థుల భవిత్యంపై ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీలు తెరవాలని సూచించినట్లు వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ స్పష్టం చేసింది.
Also Read: AP Schools: ఆ పిల్లల చదువులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అదే స్కూళ్లల్లోనే కొనసాగించాలని ఆదేశాలు


వివిధ రాష్ట్రాల్లో ఇలా..


కానీ, విద్యాసంస్థలు ఈ అంశంపై ఓ నిర్ణయానికి రాలేదు. ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు, ఇంటర్ కాలేజీలు తెరుస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 15 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. పాఠశాలల పున:ప్రారంభమే మేలని విద్యారంగ నిపుణులు అంటున్నారు. కొందరు తల్లిదండ్రులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలలను తెరవడమే మంచిదంటున్నారు. 


దూరదర్శన్, టీ–శాట్‌ పద్ధతుల్లో ఆన్‌లైన్‌ తరగతుల వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనమూ ఉండటం లేదన్న విమర్శలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో వర్చువల్‌ పద్ధతుల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారని, అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. డిజిటల్‌ క్లాసుల ద్వారా విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ దీనిపై త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పాఠశాలలు తెరిచేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.  తరగతి గదులను ప్రతీ రోజు శానిటైజ్‌ చేయాలని సూచించింది.
Also Read: BRAOU Admissions: అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు..