Rains In Hyderabad, Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈరోజు ఉదయం వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ వాసులతో పాటు రాష్ట్ర ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరో మూడు రోజులపాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ చత్తీస్ గఢ్ మరియు పరిసరాల్లోని తెలంగాణ మీద ఒక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఏర్పడింది.
హైదరాబాద్ లో వర్షం, నగరవాసుల హర్షం..
వర్షపు చినుకులతో హైదరాబాద్ వాసులకు ఎండల నుంచి ఉపశమనం కలిగింది. నగరంలోని మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గంలో మోస్తరు వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. నార్సింగి, కోకాపేట, పటాన్ చెరువు, మియాపూర్, గాజులరామారం, జీడిమెట్ల, బీహెచ్ ఈఎల్, ఆర్సీ పురం, అల్వాల్, బాలానగర్ ఏరియాలలో వర్షం కురుస్తోంది. నీళ్లు ఉన్నచోట జాగ్రత్తగా నడవాలని అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షపు సూచనతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ సహా చుట్టు పక్కల 2, 3 జిల్లాలలో రేపు ఎల్లుండి 39 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది.
రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది.