Telangana private college bandh called off:  తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్ విరమణ ప్రకటించారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో జరిగిన చర్చలు సఫలమై, ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (FATHI) బంద్ ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే  రూ.600 కోట్లు చెల్లించిందని.. త్వరలో మరో రూ.300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 3వ తేదీ నుంచి మూతలు పడిన ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కాలేజీలు  వెంటనే తెరుచుకుంటాయి.  

Continues below advertisement


భట్టితో  చర్చల తర్వాత సమ్మె విరమణ          


హైదరాబాద్‌లో జరిగిన చర్చల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడారు.   చర్చలు సఫలమైనందున, బంద్ విరమించి కాలేజీలు యథావిధిగా తెరుచుకుంటాయని FATHI నేతలు ప్రకటించారు.నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్‌కు దిగాయి.  రీఎంబర్స్మెంట్ చెల్లించకపోవడంపై యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కాలేజీలు మూతలు పడటంతో లక్షలాది మంది విద్యార్థులకు సెలవులు వచ్చినట్లయింది.   స్ట్రైక్‌లో ర్యాలీలు, మార్చ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. బహిరంగసభ కూడా ప్లాన్ చేశారు.  


సీఎం హెచ్చరికల తర్వాత భట్టి విక్రమార్కతో కాలేజీ యాజమాన్యాల చర్చలు          


అంతకు ముందు ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ ప్రైవేటు కాలేజీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   విద్యార్థుల జీవితాలతో ఆటలాడకండి.. తమాషాలు చేస్తే తాటా తీస్తాం.. రాజకీయ పార్టీలతో అంటకాగుతూ బ్లాక్‌మెయిల్ చేస్తే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.  కాలేజీలలో సౌకర్యాలు ఉన్నాయో లేవో తనిఖీలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.  రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్తగా సమస్యలు వచ్చినట్టు మాట్లాడకండి.. ముందు ప్రభుత్వాల్లో ఈ సమస్య లేదని చెప్పడం తప్పు. మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తెలుసని  హెచ్చరించారు.   



పని చేసిన సీఎం రేవంత్ హెచ్చరికలు                          


అడిగినవి ఇవ్వకపోతే కాలేజీలు మూసేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. బ్లాక్‌మెయిల్ చేస్తే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.  ప్రభుత్వం విడతలవారీగా  రీఎంబంర్స్ మెంట్  నిధులు విడుదల చేస్తామని, కానీ స్ట్రైక్‌లు, రాజకీయ ఒత్తిడి చేస్తే తాట తీస్తామని స్పష్టం చేశారు.  వచ్చే ఏడాది నుంచి డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో.. ఫీజులు ఎలా అడుగుతారో చూస్తామని సీఎం హెచ్చరికలు జారీచేశారు. రేవంత్ హెచ్చరికలు జారీ చేసిన కాసేపటికే సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటించారు.