TS Power Demand : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్(Electricity Demand) 14,117 మెగావాట్లు‌ మంగళవారం నమోదు అయింది. ఇవాళ సాయంత్రానికి ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అత్యధిక విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లు మాత్రమే ఉండేది. సౌత్ ఇండియా(South India)లో అత్యధిక విద్యుత్ వినియోగంలో తెలంగాణ(Telanagana)ది రెండో స్థానం నిలుస్తోంది. మొదటి స్థానంలో తమిళనాడు(Tamil Nadu) ఉంది.  తెలంగాణలో విద్యుత్ వాడకంలో రికార్డులు తిరగరాస్తుంది. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగంలో పీక్ డిమాండ్ వస్తుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద విద్యుత్ వినియోగం పెరుగుతుండడం, మార్చి నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అధికమైనట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. వాణిజ్య, గృహ విద్యుత్(Domestic Power Usage) వినియోగం భారీగా పెరుగుతుందని, అయినా ఎక్కడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. 


గత ఏడాడి రికార్డు బద్దలు 


మార్చి నెలలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు(High Temperatures) నమోదు అవుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మార్చి నెలలోనే అత్యధికంగా మంగళవారం మధ్యాహ్నానికి 14,117 మెగావాట్ల విద్యుత్ వాడకం రికార్డు అయింది. గత ఏడాది మార్చి 31న 13,688 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు కాగ, ఈ సంవత్సరం రికార్డు తిరగరాస్తూ ఏకంగా 14,117 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యింది. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలో భారీగా విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ అధికారులు తెలిపారు. గత ఏడాది హైదరాబాద్ లో 55 మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం కాగా ఈ ఏడాది మార్చిలోనే 65 మిలియన్ యూనిట్లు డిమాండ్ వచ్చిందని తెలిపారు.  


15 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చిన పర్లేదు 


మార్చిలోనే విద్యుత్ వినియోగం పీక్ దశలో ఉంటే ఏప్రిల్, మే మొదటి వారంలోనే 15 వేల మెగావాట్ల చేరువలో పీక్ డిమాండ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 15 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చిన విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో 11.34 శాతం వృద్ధి నమోదు అయింది. ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం నమోదు అయితే తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధిరేటు సాధించి రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2017-18 తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,727 యూనిట్లు ఉండగా, 2018-19 నాటికి 1,896 యూనిట్లు చేరింది.