CPM Third List: తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది సీపీఎం పార్టీ జోరు పెంచింది. కొత్తగా మరో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ తమ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా, ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను ఇప్పటికే సీపీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆదివారం ఉదయం 14 మందితో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తొలి జాబితా విడుదల చేశారు. సోమవారం ఉదయం ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి మల్లు లక్ష్మి, నల్గొండ నియోజకవర్గం నుంచి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. మంగళవారం సాయంత్రం ముగ్గురి పేర్లు వెల్లడిస్తూ మూడో జాబితాను సీపీఎం విడుదల చేసింది. సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ మేనిఫెస్టోను సైతం ప్రకటించారు. పొత్తులపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుని సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని, అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని పేర్కొన్నారు.
ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేస్తే ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ నేతల వైఖరి, తమను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వని కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తమ్మినేని తేల్చి చెప్పారు.
అభ్యర్థులు వీరే
- భద్రాచలం (ఎస్టీ) - కారం పుల్లయ్య
- అశ్వారాపుపేట (ఎస్టీ) - పిట్టల అర్జున్
- పాలేరు - తమ్మినేని వీరభద్రం
- మధిర (ఎస్సీ) - పాలడుగు భాస్కర్
- వైరా (ఎస్టీ) - భూక్యా వీరభద్రం
- ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్
- సత్తుపల్లి (ఎస్సీ) - మాచర్ల భారతి
- మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి
- నకిరేకల్ (ఎస్సీ) - చినవెంకులు
- భువనగిరి - కొండమడుగు నర్సింహ
- జనగాం - మోకు కనకారెడ్డి
- ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య
- పటాన్ చెరు - జె.మల్లికార్జున్
- ముషీరాబాద్ - ఎం.దశరథ్
- హుజూర్‌నగర్ - మల్లు లక్ష్మి
- నల్గొండ - ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
- కోదాడ - మట్టిపల్లి సైదులు
- మునుగోడు - దోనూరు నర్సిరెడ్డి
- ఇల్లందు - దుగ్గి కృష్ణ