Telangana Politics: బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతో తెలంగాణ ఏర్పడిందని కరీంనగర్ మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్ ప్రొసీజర్ ఎలా నడుస్తుందో తెలియని ప్రధాని తెలంగాణ బిల్లును తలుపులు మూసి ఆమోదించారని అవమానించారని గుర్తు చేశారు. అందుకే వారికి క్షమాపణలు చెప్పిన తరువాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పామని ఆయన అన్నారు. సిగ్గున్నవారు ఎవరు బీజేపీలో ఉండరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వారు తెలంగాణ డీఎన్ఏ నా కాదా అని పరీక్ష చేసుకోవాలంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే దేశంలో కాంగ్రెస్ ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందంటూ ఆరోపించారు. 






ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం.. అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు. రామగుండం మాత్రమే కాదు ఇంకా 4 ఫ్యాక్టరీలు అప్పటి ప్రభుత్వం పున ప్రారంభానికి 18400 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఇది బీజేపీ అజ్ఞానులకు తెలియదా అంటూ ధ్వజమెత్తారు. దేశంలో యూరియా, డీఏపీలు దిగుమతి చేసుకునే అవసరం ఉందన్నారు. ఆరోజు లక్ష కోట్ల సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. 8 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక్క ఎరువుల ఫ్యాక్టరీ అయిన ఏర్పాటు చేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.






పేదలను దోచుకునే వారిని వదలం అంటున్న ప్రధాని ఈ దేశంలో పేదలను దోచుకుంటున్నది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. దేశంలో మీకన్నా పెద్ద దోపిడీ దారులు ఎవరైనా ఉన్నారా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను తినడం వల్ల న్యూట్రిషన్ పెరుగుతుంది కానీ.. మీరంటున్నటు తిట్ల వల్ల కాదని చెప్పుకొచ్చారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు ప్రభుత్వ రంగ సంస్థలు అంబాని, ఆధానిలకు అమ్మడం లేదా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎం అన్నారు.. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మోడీ వచ్చినప్పుడు వెళ్లి తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ కొట్లాడాల్సిందని చెప్పారు. 8 సంవత్సరాలుగా అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి.. ఇప్పుడు రాజకీయ దోబూచులాడుతున్నారంటూ విమర్శలు చేశారు. అహ్మదాబాద్ కు బుల్లెట్ ట్రైన్ వేసినట్టు.. హైదరాబాద్ నుండి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ వేయించడని అన్నారు.