Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో విజయనగరం జిల్లా గుంకలాం చేరుకోనున్నారు. జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆనందపురంలో ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. గజ మాల వేసి నినాదాలతో హోరెత్తించారు. సింహాచలం భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ పలువురు నేతలు, కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు. 






గంకులాంలో 397 ఎకరాల్లో జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఇది రెండో అతిపెద్దది. 2020 డిసెంబర్ 30వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నేటికీ ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయి. విజయనగరం నగరానికి దూరంగా ఉండటం. సరైన సదుపాయాలు లేకపోవడం, నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, ప్రభుత్వం ఇచ్చే సాయం చాలకపోవడం, బిల్లులు సకాలంలో రాకపోవడం వంటి కారణాలతో అక్కడ పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే గుంకలాంలో ఇళ్ల నిర్మాణాల్లో జరుగుతున్న అలసత్వాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పవన్ అక్కడ పర్యటిస్తున్నారు. 






జగనన్న కాలనీల్లో అతి పెద్ద స్కాం దాగి ఉందని దాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంది. జగనన్న ఇళ్ళ పేరుతో అదికార పార్టికి చెందిన నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని.. .సోషల్ మీడియా వేదిక గా జగనన్న కాలనీల్లో అవినీతి పై పోరాటం చేయాలని ఆ పార్టీ నేతల నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పేరుతో చేపడుతున్న జగనన్న కాలనీలు అతి పెద్ద స్కాం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. భూమి కొనుగోలు, మౌలిక వసతులు పేరిట వేల కోట్లు అవినీతి చేశారని ఆయన ఆరోపించారు.


మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్..


జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన ఫోటోలు, వీడియోలను #Jagananna Mosam హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కూడ రాష్ట్రంలో ఒక చోట అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగనన్న కాలనీలను పరిశీలిస్తారని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల 30వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హామీ ఇచ్చారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారని, చెప్పిన గడువు ముగిసి ఐదు నెలలు కావొస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు.