Australia Cruise Ship Covid: మళ్లీ కరోనా కలకలం- ఆ నౌకలో 800 మందికి వైరస్!

ABP Desam   |  Murali Krishna   |  13 Nov 2022 12:08 PM (IST)

Australia Cruise Ship Covid: 800 మందికి కరోనా సోకడంతో ఒక క్రూజ్ నౌకను సిడ్నీ తీరంలో నిలిపివేశారు.

మళ్లీ కరోనా కలకలం- ఆ నౌకలో 800 మందికి వైరస్!

Australia Cruise Ship Covid: ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనా వైరస్.. ప్రస్తుతం కాస్త నెమ్మదించింది. దీంతో చాలా మంది కరోనా వైరస్ నిబంధనలను పక్కన పెట్టేశారు. చాలా మంది భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి వాటిని మర్చిపోయారు. కానీ ఇలా చేయడం వల్ల మనమే మరో కరోనా వేవ్‌ను స్వాగతించినట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా దాదాపు 800 మంది కరోనా బాధితులతో ఉన్న ఒక క్రూజ్ నౌక ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేయాల్సి వచ్చింది.

ఇదీ సంగతి

12 రోజుల పాటు సముద్రయానం చేసేందుక ఒక క్రూజ్ నౌక 4,600 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరింది. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన ఈ నౌక పేరు మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ క్రూజ్‌ షిప్‌. అయితే సగం ప్రయాణంలో భారీ ఎత్తున కరోనా కేసులు వచ్చాయి. దీంతో సిడ్నీ తీరంలో ఈ నౌకను నిలిపివేయాల్సి వచ్చింది.

వైరస్ బారినపడిన కొందరిలో లక్షణాలు కనిపించడం లేదు. మరికొందరిలో వ్యాధి తీవ్రత స్వల్ప స్థాయిలో ఉంది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచాం. వారికి తగిన సదుపాయాలు కల్పించాం. ఈ నౌక త్వరలో మెల్‌బోర్న్‌కు చేరుకుంటుంది.                                                 -   క్రూజ్ సిబ్బంది

కలకలం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో వారం వ్యవధిలో 19,800 కేసులు వచ్చాయి. చైనాలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పలు నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్ కూడా కొనసాగుతోంది. ప్రపంచంలోనే తొలిసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లిన ప్రాంతంగా వుహాన్‌ నిలిచింది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే.. చైనా మాత్రం జీరో-కొవిడ్‌ వ్యూహాన్ని పాటిస్తోంది.

కరోనా మాట దేవుడెరుగు ముందు.. ఆంక్షలు పేరుతో జనాలను చైనా చంపేస్తోందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కఠిన లాక్‌డౌన్‌లతో చైనాలో ప్రజలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. చైనా అధికారుల తీరును చూస్తుంటే కరోనా వైరస్‌ కంటే లాక్‌డౌన్‌తోనే చైనా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Also Read: Guinness World Record: 24 గంటల్లో 78 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు!

Published at: 13 Nov 2022 11:43 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.