2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూసుకెళుతున్న కారు పార్టీకి ఈ దఫా వెన్నుదన్నుగా కమ్యూనిస్టు పార్టీలు నిలుస్తాయనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కమ్యూనిస్టులు అనుసరిస్తున్న వ్యూహామే ఇందుకు కారణం. ప్రజాసమస్యలపై నిరంతరం తమ గళాన్ని వినిపించే కమ్యూనిస్టులు ప్రతిపక్ష పార్టీలతోనే సయోధ్యలో ఉంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా కమ్యూనిస్టుల వ్యూహం మారడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది.


నాగార్జున సాగర్‌ ఎన్నికల అనంతరం కమ్యూనిస్టులు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. సీపీఐ పార్టీ ఇప్పటికే వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీ నాయకులు సైతం వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందనే పేర్కొనడం విశేషం. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో సత్తా చాటేందుకు సీపీఐ పార్టీ ముందస్తు వ్యూహంలోనే సాగుతుందని తెలుస్తోంది. 
చట్టసభల్లో ప్రాతినిద్యం కోసమేనా..?
తెలంగాణలో కమ్యూనిస్టుల బలం కొన్ని జిల్లాలో ఉంటుంది. ఎన్నికల్లో సొంతంగా గెలవలేకపోయినప్పటికీ గెలుపు ఓటములను నిర్దేశించే సత్తా వీరికి ఉంది. అయితే ప్రతిసారీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే కమ్యూనిస్టులు 2018 ఎన్నికల్లో మాత్రం తమ అసెంబ్లీకి తమ పార్టీ ప్రతినిధులను పంపలేకపోయారు. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో సీపీఐ పార్టీ భాగస్వామ్యం కాగా సీపీఎం పార్టీ బీఎల్‌ఎఫ్‌ పేరుతో ఒంటరిగా బరిలోకి దిగింది. అయితే ప్రతి సారీ కనీసం ఒకరో ఇద్దరో గెలిచే కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో గెలవలేకపోయారు. అయితే ఈ సారి తమ ప్రాతినిథ్యాన్ని కాపాడుకునేందుకు కారు పార్టీతో జత కట్టాలని బావిస్తున్నట్లు తెలుస్తోంది.


టీఆర్‌ఎస్‌తో పొత్తుపై సీపీఎం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తునప్పటికీ సీపీఐ పార్టీ మాత్రం బహిరంగంగానే మద్దతు పలుకుతుంది. 2023 ఎన్నికల కోసం ముందస్తు వ్యూహం ప్రకారమే సీపీఐ పార్టీ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఉప ఎన్నికల్లో బహిరంగంగానే మద్దతు పలుకుతుంది. ఉద్యమాల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న సీపీఐ పార్టీ ఎన్నికల సమయంలో మాత్రం టీఆర్‌ఎస్‌కు మద్దుతుగా నిలవడం గమనార్హం. 
నాగార్జునసాగర్‌ నుంచి మొదలు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకునేందుకు వ్యూహం మార్చిన సీపీఐ పార్టీ నాగార్జున సాగర్‌ ఎన్నికలతో తన వైఖరిని చెప్పకనే చెబుతోంది. నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి బదులుగా టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు పలికిన సీపీఐ పార్టీ ఆ తర్వాత జరిగిన ఖమ్మం కార్పోరేషన్‌ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుంది. ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందనే ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు కైవసం చేసుకునేందుకు ఈ వ్యూహంతో ముందుకెళుతున్నారని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు ఈ సారి పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును కేటాయించేందుకు ఒప్పందం కూడా కుదిరిందనే ప్రచారం సాగుతుంది.


సీపీఐ గతంలో ప్రాతినిథ్యం వహించిన వైరా నియోజకవర్గంలో సైతం సీపీఐ పార్టీ ఈ సారి పాగా వేయాలని బావిస్తోందనే ప్రచారం సాగుతుంది. మరోవైపు సీపీఎం పార్టీ గత ఎన్నికల్ల బీఎల్‌ఎఫ్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయగా ఈ సారి తన వైఖరి ఎలా ఉండబోతుందనే విషయం బహిర్గతం కానప్పటికీ సీపీఐ పార్టీ మాత్రం కారు పార్టీతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. 
Also Read: KCR Nominated Posts : ఉద్యమకారుల్లో అసంతృప్తి తగ్గించేందుకు నామినేటెడ్ పోస్టులు.. కొత్తగా మరో ఐదుగురికి రాష్ట్ర స్థాయి పదవులిచ్చిన కేసీఆర్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి