Bandi Sanjay: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లాగా ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం, పార్టీలు మారడం తనకు చేతకాదని బీపేజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి పార్టీని ఎలా నడుపుతున్నారు. అదే పార్టీకి చెందిన జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో కూడా వాళ్లు చాలా బాగా చెబుతారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని, పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తామంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తాము గెలుపు పరంపరను కొనసాగిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఓటమి పరంపను కొనసాగిస్తుందని అన్నారు. తమ దగ్గర సీనియర్లే బాస్ లు అని.. అదే హస్తం పార్టీలో సీనియర్లు హోంగార్డులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు క్యాండిడేట్లు దొరకట్లేదంటూ ప్రశ్నించారు. అలాగే సొంత పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తనకు చేతకాదంటూ రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. 


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అసదుద్దీన్ ఎందుకు రాలేదు?


బీజేపీ పార్టీ ఎక్కడ ఉందో సీఎం కేసీఆర్ ను, ఆయన కుమారుడైన మంత్రి కేటీఆర్ ను అడగాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఉందో, బీజేపీ ఉందో చీటర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తెలిసిపోయిందని అన్నారు. తమది కుటుంబ పార్టీ కాదని.. తండ్రి పేరు చెప్పుకొని కుమారుడు, కూతుర్లు సీఎంలు కాలేరంటూ విమర్శించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎందుకు పాల్గొనలేదో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పారని డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీని నిజమైన ముస్లింలు వ్యతిరేకించాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జెండా ఎగుర వేయని వాళ్లకి రాష్ట్రంలో పోటీ చేసే అర్హత కూడా లేదని చెప్పారు. జెండా ఎగుర వేయనందుకు.. దారుస్సలాంను స్వాధీనం చేసుకొని తాళం వేయాలని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకొని పేద ముస్లింలకు ఇచ్చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


 కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వల్లే ఇదంతా సాధ్యమైంది..!


సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామని బండి సంజయ్ గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించామని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వల్లే ఈ వేడుకలు విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారని వివరించారు. 


బీఆర్ఎస్ అండగా ఎంఐఎం ఉందని.. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ కూడా మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉందంటూ బండి సంజయ్ మూడ్రోజుల క్రితమే షాకింగ్ కామెంట్లు చేశారు. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ మినహా మరెక్కడా పోటీ చేసే దమ్ము లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ము కాస్తుందని అన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చి.. వారి జీవితాలను ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ పెద్దది చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.