Anantapur: శ్రీ సత్యసాయ జిల్లా ధర్మవరానికి చెందిన రామాంజనేయులు (45) అనే వ్యక్తి మూడు నెలల క్రితం తన భార్య నల్లపూసల దండను మింగేశాడు. ఇటీవల కడుపు నొప్పి తీవ్రం కావడంతో అసలు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు రామాంజనేయులుని అనంతపురంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. వేలల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో మే 29వ తేదీన ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుకుమార్ రామాంజనేయులును పరీక్షించారు. వివరాలు ఆరా తీయగా, తాను నల్లపూసల దండను మింగానని, అప్పటి నుండి ఏం తినలేకపోతున్నానని తన ఇబ్బంది గురించి డాక్టర్ కు వివరించాడు. ఆ తర్వాత వైద్యులు అతడికి ఎక్స్ రే తీశారు. 


అన్నవాహిక వద్ద ఇరుక్కున్న నల్లపూసల దండ


రామాంజనేయులకు ఎక్స్ రే తీయగా అన్నవాహిక వద్ద నల్లపూసల దండ డాలర్ ఇరుక్కున్నట్లు తేలింది. దండ కడుపులోని ఈసోఫాగస్ (ఫుడ్ పైప్) వరకు వెళ్లినట్లు కనిపించింది. దీంతో కడుపులోని నల్లపూసల దండ తీసేందుకు తనను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అనంతరం శస్త్రచికిత్స లేకుండానే కడుపులో ఉన్న నల్లపూసల దండ బయటకు తీయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మే 30వ తేదీన అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సుకుమార్, డాక్టర్ కృష్ణ సౌమ్య, స్టాఫ్ నర్సులు, అనస్తీషియా వైద్యుడు డాక్టర్ వేమానాయక్, ఓటీ టెక్నీషియన్ రాజేశ్ లు కలిసి రామాంజనేయులు అన్నవాహికకు మత్తు మందు ఇచ్చారు. 


ఫ్లెక్సిబుల్ గ్యాస్ట్రో ఎండోస్కోపీ ద్వారా వెలికితీత


అన్నవాహిక వద్ద ఇరుక్కున్న నల్లపూసల దండను బయటకు తీసేందుకు ఫ్లెక్సిబుల్ గ్యాస్ట్రో ఎండోస్కోపీ చేయాలని నిర్ణయించారు. ఒక ప్రణాళిక ప్రకారం వైద్యులు, సిబ్బంది కలిసి విజయవంతంగా నల్లపూసల దండను బయటకు తీశారు. ప్రస్తుతం రామాంజనేయులు ఆరోగ్యంగా ఉన్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ సుకుమార్ తెలిపారు. శస్త్ర చికిత్స లేకుండా కడుపు లోపల ఉన్న నల్లపూసల దండను బయటకు తీసిన వైద్యులను జీజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ రఘునంద్ అభినందించారు. 


కొన్ని రోజుల క్రితం డబ్బా మింగి చనిపోయిన చిన్నారి


కర్నూలు జిల్లా సి,బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామంలో కొన్ని రోజుల క్రితం తీవ్ర విషాదం జరిగింది. గ్రామానికి చెందిన నల్లమ్మ, సువర్ణ దంపతుల పది నెలల కుమారుడు ఉన్నాడు. ఒకరోజు అతడు మెంతో ప్లస్ బామ్ డబ్బాతో ఆడుకుంటూ దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. పొరపాటున మింగేయగా.. అది గొంతులో ఇరుక్కుపోయింది. చిన్నారి ఉన్నట్టుండి ఇబ్బందిగా ఏడవడంతో విషయం గుర్తించిన తల్లిదండ్రులు డబ్బాను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రికి వెళ్లగా బాబు గొంతులో డబ్బా ఇరుక్కోవడంతో ఊపిరాడకనే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఎన్నో దేవుళ్లకు పూజలు చేయగా, మరెన్నో ఆస్పత్రుల చుట్టూ తిరగ్గా.. పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన బిడ్డ ఇలా చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల విలపించిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు.