Telangana Police Searched For Balka Suman: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy)ను దూషించిన వ్యవహారంలో ఆయనపై మంచిర్యాల (Mancherial) పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆయనపై రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, గత రెండు రోజులుగా ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇదీ జరిగింది


మంచిర్యాల జిల్లాలో పార్లమెంటు స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'చెప్పుతో కొడతా నా కొడకా' అంటూ చెప్పు చూపిస్తూ మండిపడ్డారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామని.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి పదవిని బట్టి స్థాయిని బట్టి మాట్లాడాలని అన్నారు. రైతు బంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని అహంకారంతో మాట్లాడుతున్నారన్నారని అన్నారు. రైతుబంధు కోసం గ‌త ప్రభుత్వంలో విడుద‌ల చేసిన రూ.7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కి, కాంగ్రెస్ కంట్రాక్ట‌ర్ల‌కి జేబుల్లోకి మలుపుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపణ చేశారు.


పోలీసులకు ఫిర్యాదు


సీఎం రేవంత్ పై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు చూపిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల అతడిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ ఎక్కడో వేరే జిల్లా నుంచి వచ్చి మంచిర్యాల జిల్లాలో పెద్దతనం చేస్తానంటే కుదరదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. త్వరలో కాంగ్రెస్ కార్యకర్తలు బాల్క సుమన్ కు తగిన శాస్తి చేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. బాల్క సుమన్ చేసిన ఆగడాలు, రాసలీలలు అన్ని త్వరలో బయటపెడతానని వెల్లడించారు.


జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు


మరోవైపు, బాల్క సుమన్ వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ దిష్ఠి బొమ్మలను దహనం చేసి బాల్క సుమన్ ను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. ప్రజా పాలనను చూసి ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఇతర జిల్లాలకు చెందిన సుమన్ ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించడానికి కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ మెప్పుకోసం కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సుమన్ అహంకారం చెన్నూర్ లో ఆయన ఓటమికి కారణమైందని గ్రహించుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. పోలీసులు సుమన్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


Also Read: Telangana Assembly: ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అడ్డుకున్న పోలీసులు, అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత