Coconut water benefits: తియ్యని, స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు వేసవి తాపాన్ని తీర్చడంలో ముందుంటాయి. ఖనిజ లవణాలు, ఎలక్ట్రోలైట్లు కలిగిన కొబ్బరి నీరు జీర్ణాశయంలో ఏర్పడే సమస్యలకు సహజ చికిత్స చేస్తాయి.
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIMS)కి చెందిన వైద్య నిపుణులు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఎనిమిది వారాల పాటు ప్రతి రోజూ కొబ్బరినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలను గురించి వెల్లడించారు. అల్సరేటివ్ కోలైటిస్ సమస్య ప్రారంభదశలో ఉన్నవారిలో చాలా మెరుగైన మార్పులు కనిపించాయట. కొబ్బరినీళ్లలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇది కోలైటిస్ సమస్యలో మంచి ఫలితాలు ఇస్తున్నట్టు భావిస్తున్నారు. అందుకే ఇతర గ్యాస్ట్రోఇంటస్టయిన్ సమస్యలకు కొబ్బరి నీళ్లు చికిత్సగా వాడాలని నిర్ణయించారు.
అయోధ్యలో రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు దాదాపుగా 11 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడి నిరాహార దీక్షలో ఉన్నారు. ఆసమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసకున్నారట. ఈ విషయం ఆయన వెల్లడి చేసిన తర్వాత కొబ్బరి నీళ్లకు ప్రజాధరణ గణనీయంగా పెరింగిందట.
వేడిగా, తేమగా ఉండే తీరప్రాంతాల్లో కొబ్బరి నీళ్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ కొబ్బరి సాగు చాలా ఎక్కువగా సాగుతుంది. ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కనుక ఉపవాసంలో ఉన్న వారికి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారు త్వరగా శక్తి సంతరించుకోవడానికి కూడా దోహదం చేస్తాయి. సహజంగా చల్లగా ఉండే ఈ పానీయం క్యాలరీ కాన్షియస్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు. ఇన్ని సుగుణాలున్న కొబ్బరినీళ్ల ఉపయోగాలు మరి కొన్ని తెలుసుకుందాం.
హైడ్రేటింగ్ డ్రింక్
ఉపవాస సమయంలో లేదా వర్కవుట్ల మధ్య విరామాల్లో, ఎండలో తిరగాల్సి వచ్చినపుడు చెమట రూపంలో నష్టపోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందేందుకు కొబ్బరి నీళ్లు గొప్ప ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం తో పాటు ఎలక్ట్రోలైట్స్ వంటి పోషకాలతో ఉంటుంది.
శక్తి పెంచుతుంది
ఇందులో ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిస్థాయిని తక్షణమే పెంచడంలో కొబ్బరి నీళ్లు ఉత్తమమైన ఎంపిక.
చర్మ సంరక్షణ
చర్మం క్లియర్ గా మెరుస్తూ ఉండేందుకు కొబ్బరి నీళ్లు దోహదం చేతాయి. శరీరంలో టాక్సిన్లను బయటికి పంపి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఫ్రీరాడికల్ చర్య నుంచి చర్మాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా మలాయి కలిగిన కొబ్బరి నీళ్లు చర్మం పై మెరుపును పెంపొందిస్తాయి.
యాంటీఇన్ఫ్లమేటరీ
కొబ్బరి నీళ్లలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మైక్రోబయోమ్ ను సమర్థవంతంగా మార్చగలదు. పోటాషియం కలిగి ఉంటుంది కనుక తేలిక పాటి అల్సర్లను, కోలైటిస్ సమస్యకు మంచి చికిత్సగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీరు ఎక్కువైన పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్ లను విసర్జించడానికి సహాయపడుతుంది. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం నివారించబడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.
మోతాదు తప్పకూడదు
కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలున్నప్పటికీ, ప్రయోజనాలు ఉన్నప్పటికీ పరిమితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహులు సహజ చక్కెరలు కలిగిన ఈ పానీయాన్ని మితంగా తీసుకోవాలి. చాలా రకాల ఇతర పానీయాలతో పోలిస్తే ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Also read : Quit Alcohol: అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.