Police Alert to Prajapalana Applicants: మోసానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆశను అవకాశంగా మలుచుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల పెండింగ్ చలాన్ల రాయితీ విషయంలో సైబర్ నేరగాళ్లు ఫేక్ లింక్స్ మెసేజ్ పంపి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించిన పోలీసులు.. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు కోసం 'ప్రజాపాలన' దరఖాస్తుల విషయంలోనూ సైబర్ నేరగాళ్లు పథకాల పేరిట ఫేక్ కాల్స్ చేస్తున్నారని దరఖాస్తుదారులను అలర్ట్ చేశారు.


ఓటీపీ చెప్పాలంటూ


కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు కోసం 'ప్రజాపాలన' పేరిట డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. 8 రోజుల పాటు గ్రామసభలు, పట్టణాల్లో నిర్వహించిన కార్యక్రమానికి దాదాపు 1,24,85,383 అర్జీలు వచ్చాయి. అయితే, పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. 'మీకు రేషన్ కార్డు, ఇళ్లు, ఇతర పథకాలు మంజూరయ్యాయి. మీ ఫోన్ నెంబరుకు ఓటీపీ పంపించాము. ఆ ఓటీపీ చెప్పండి' అంటూ ఫోన్లు చేస్తున్నారు. కాగా, ఇది ఫేక్ అని ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి ప్రాసెస్ ప్రారంభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత విషయాలు, ఓటీపీ వంటి వివరాలు ఎవరకీ చెప్పొద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కాల్స్ వస్తే తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. 


కోటికి పైగా దరఖాస్తులు


మరోవైపు, 'ప్రజాపాలన'కు సంబంధించి దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. మొత్తం 1,24,85,383 అర్జీలు రాగా.. అన్ని దరఖాస్తుల ఎంట్రీని సోమవారం నుంచి ప్రారంభించి 17 నాటికి పూర్తి చేసి అర్హతను బట్టి ఆయా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియలో ఎక్కువగా 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్లుపైనే దరఖాస్తుదారులు ఎక్కువ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. చాలా మంది తమ రేషన్ కార్డులు సొంతూరిలో ఉండడంతో అక్కడికి వెళ్లి అప్లికేషన్స్ సమర్పించారు. అయితే, 'ప్రజాపాలన'లో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రతీ 4 నెలలకోసారి ఈ కార్యక్రమం చేపడతామని ప్రభుత్వం తెలిపింది. తొలి విడతలో అప్లై చేసుకోని వారు రెండో విడతలో అర్జీలు సమర్పించవచ్చని చెప్పింది. గ్రామసభల్లో దరఖాస్తు ఇచ్చేందుకు వీలు పడని వాళ్లు స్థానిక తహసీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీస్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.


డీటీపీ ఆపరేటర్లకు శిక్షణ


వచ్చిన అప్లికేషన్‌లను ఆన్‌లైన్‌ చేయడానికి భారీగా డీటీపీ ఆపరేటర్లను నియమించింది ప్రభుత్వం. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారితో వేగంగా పని జరగకపోతే మరికొంతమందిని నియమించాలని కూడా భావిస్తోంది. ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వారి అర్హతలను ఎలా నిర్ణయిస్తుందనే విషయంపై మాత్రం వివరాలు వెల్లడించలేదు. వచ్చే నెల నుంచి మహిళలకు 2500వేలు ఇస్తామని ప్రకటించిన వేళ అసలు ఎవరికి వస్తుంది ఈ పథకం కోసం ఎలాంటి అర్హతలు తెరపైకి తీసుకొస్తారనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది.  


ప్రభుత్వ ప్రత్యేక వెబ్ సైట్


మరోవైపు, 'ప్రజాపాలన' నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించింది. prajapalana.telangaana.gov.inను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమీషనర్ తదితర ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారు. ఆ సమావేశంలో సైట్ https://prajapalana.telangana.gov.in/ ను లాంచ్ చేయనున్నారు.


Also Read: KCR is Back: గులాబీ బాస్ రిటర్న్ బ్యాక్ సూన్ - పార్లమెంట్ కు అభ్యర్థుల ఎంపికపై BRS వ్యూహం ఏంటి?