తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజా బులెటిన్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదు అయిన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. గత 24 గంటల్లో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 123 మంది శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు వచ్చారు. వాళ్లందరికీ కరోనా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా 10 మందికి ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపినట్లు తెలిపారు. కరోనా, ఒమిక్రాన్ దృష్ట్యా వైద్య ఆరోగ్యశాఖ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. మాస్క్ లు ధరించని వారికి రూ.1000 ఫైన్ విధించాలని అధికారులకు సూచించింది. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలిపింది. 





Also Read: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన


79కు చేరిన ఒమిక్రాన్ కేసులు 


ఇప్పటి వరకూ ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి తెలంగాణకు 12,692 మంది ప్రయాణికులు వచ్చారు. వీరందరికీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోవిడ్ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 144 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చాయి. వారందరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపారు అధికారులు. వారిలో 44 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా వచ్చింది. మిగిలిన 100 మందిలో 79 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది.  ఇంకా 21 మంది ఫలితాలు రావాల్సిఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 79 ఒమిక్రాన్ బాధితుల్లో 27 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. 


Also Read: జహీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... బైకును ఢీకొట్టిన కారు...చిన్నారి సహా నలుగురు మృతి


రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు


రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,886 కరోనా నిర్ధారణ నమూనాలను పరీక్షించారు. ఈ నమూనాల్లో కొత్తగా 317 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,029కి చేరింది. కరోనా బారి నుంచి శుక్రవారం 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 3,733 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి