TS Name Changed to TG For Vehicle Registrations: తెలంగాణ ప్రభుత్వం TS పేరును TGగా మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ (TS) బదులుగా తెలంగాణ గవర్నమెంట్ (TG) అని మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంతో టీఎస్ అని ఉన్న వాహనాలు, ఇతర సంస్థల పేర్లు టీజీ అని మారుస్తారా.? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చాలా.? అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న టీఎస్ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకే నెంబర్ ప్లేట్లను ఇలా రిజిస్టర్ చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం 'TG' మార్పుపై అధికారిక జీవో విడుదల చేసిన తర్వాత కొత్త వాహనాలకు టీజీ నెంబరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని సమాచారం. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడినప్పుడు సైతం ఇదే తరహాలో మార్పులు జరగ్గా.. అప్పటివరకూ ఉన్న ఏపీ రిజిస్ట్రేషన్లను యథావిధిగా కొనసాగిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. విభజన అనంతరం ఏపీ నెంబర్ ప్లేట్స్ తోనే 30 లక్షల వాహనాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వాహనదారులపై భారం పడకుండా రాష్ట్ర రవాణా శాఖ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
గైడ్ లైన్స్ సిద్ధం?
రాష్ట్రంలో ఇప్పటికే 1.50 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 10 వేల నూతన వాహనాలు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అయితే, కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాల నెంబర్ ప్లేట్స్ మాత్రమే 'TG'గా మార్చేలా రవాణా శాఖ గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 'TS'గా ఉన్న నెంబర్ ప్లేట్లు అలాగే కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి మరో 2, 3 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
'అందుకే మార్చాం'
మరోవైపు, తెలంగాణ తల్లి విగ్రహం రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ TS నుంచి TGగా మార్చడంపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. ఈ నిర్ణయాల వెనుక 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉందని అన్నారు. 'ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే ‘జయ జయహే తెలంగాణ' గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా.. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా… రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా… వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ నినాదం TG అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం.' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.