Komatireddy lashed out at KCR for ignoring South Telangana projects : కేసీఆర్ పదేళ్ల పదవి కాలంలో దక్షిణ తెలంగాణను విస్మరించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.  కాళేశ్వరం కంటే ముందే ప్రారంభించిన డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదని.. కుర్చీ వేసుకుని కూర్చొని ప్రాజెక్టులు కడతామని చెప్పి పదేళ్లు పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. నల్లగొండలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు.  ఉత్తర తెలంగాణలో మాత్రం అవసరం లేకపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలో 90 శాతం పూర్తైన బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు చేసిన పాపాలకే ఎన్నికల్లో వాళ్లను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ వచ్చి నల్లగొండలో పబ్లిక్ మీటింగ్ పెడతామంటున్నారని.. ఇక్కడికి వస్తే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.                      


ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. మంత్రిగా జగదీశ్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ఏనాడూ రివ్యూ చేయలేదన్నారు. అసలు మేం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు... అప్పుడే ఎవరితోనే కుమ్మక్కు అవుతామా? అని నిలదీశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది కేసీఆర్ హయాంలోనే అని పేర్కొన్నారు.  తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని పదవులను గడ్డిపోచల్లా వదలుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.                     


పోతిరెడ్డిపాడు కోసం వైఎస్ హయాంలో జీవో తెచ్చారని.. అప్పుడు మేం వైఎస్ కు వ్యతిరేకంగా కొట్లాడామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ పాలనలో నల్గొండకు నీళ్లు ఇవ్వలేదన్నారు. సూర్యాపేటలో తాగేందుకు నీళ్లు లేక మూసీ నీళ్లు తాగుతున్నారని చెప్పారు. అవసరం లేకున్నా కమిషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం కట్టారని ఆగ్రహం వ్యక్తం మంత్రి కోమటిరెడ్డి చేశారు.                   


నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒకే సీటు గెలిచిందని... తాము కనుక ప్రచారం చేసి ఉంటే జగదీశ్ రెడ్డి 70 వేల ఓట్ల తేడాతో ఓడిపోయేవాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నైతికంగా ఇక్కడ తాము 12 సీట్లు గెలిచామన్నారు.   యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఆయన దోచుకున్నారని ఆరోపించారు. అవసరం లేకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని ఆరోపించారు. సూర్యాపేటలో తాగేందుకు నీళ్లు లేక మూసినీళ్లు తాగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేసీఆర్, బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు.