Young Man Invented Stick Tredmill: అవసరం.. ఓ మనిషిని ఆలోచింపచేస్తుంది. అవసరాన్ని అవకాశంగా మలచుకుని తమ నైపుణ్యంతో కొంత మంది నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడతారు. ఈ ఆవిష్కరణలు పదిమందికీ ఉపయోగపడడమే కాక, ఎన్నో కొత్త ఆలోచనలకు నాంది పలికే అవకాశం ఉంది. అలాంటి కోవకే చెందిన వారే వరంగల్ జిల్లా కాట్రపల్లి గ్రామానికి చెందిన హరీష్. కరెంట్ లేకుండా కర్రతో ట్రెడ్ మిల్ ను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తక్కువ ధరకే దీన్ని అందుబాటులోకి తెచ్చి శభాష్ అనిపించుకున్నారు. మరి ఆ ఆవిష్కరణ విశేషాలేంటో చదివేయండి.


కర్ర ట్రెడ్ మిల్.. అదే స్పెషల్


ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ తప్పనిసరి. అయితే, వాకింగ్ ఫ్రీగా చేయడానికి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మైదానాలు లేవు. దీంతో చాలామంది జిమ్స్ లోనూ, ఇళ్లల్లోనూ కరెంట్ తో నడిచే ట్రెడ్ మిల్స్ (వాకర్స్)పై వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన హరీష్ వాకింగ్ చేస్తుండగా వచ్చిన ఆలోచనే ఈ కర్ర ట్రెడ్ మిల్ కు ప్రతిరూపం. కాట్రపల్లికి చెందిన హరీష్ పీజీ పూర్తి చేశారు. వారి కులవృత్తి వడ్రంగి కావడంతో తండ్రికి ఆసరాగా హరీష్ ఆ పని చేసేవారు. మొదటి నుంచి ఆయన తన నైపుణ్యంతో సంప్రదాయ వండ్రంగి వస్తువులను తయారు చేసేవారు. ఏదో సాధించాలనే తపనతో అందరికీ ఉపయోగపడేలా ఏదో ఒకటి తయారు చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనకు పదును పెట్టి ఆరోగ్యం కోసం ఉపయోగపడే ట్రెడ్ మిల్ ను కరెంట్ లేకుండా పని చేసేలా, కర్రతో తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా ముందుగా ఫ్లై వుడ్ తో ట్రెడ్ మిల్ తయారు చేశారు. అది అంతగా సక్సెస్ కాకపోవడంతో తన పనితనానికి మరింత పదును పెట్టి ఈసారి వారం రోజుల్లో కర్రతో తయారు చేసి విజయం సాధించారు.


ప్రత్యేకతలివే


సాధారణంగా ట్రెడ్ మిల్స్ జిమ్ సెంటర్లు, ఇళ్లల్లో కరెంటుతో నడుస్తాయి. వీటిలో సెట్టింగ్స్ కు అనుగుణంగా వాకర్ వాకింగ్ చేయాలి. కానీ హరీష్ తయారు చేసిన కర్ర ట్రెడ్ మిల్ వాకర్ ఎనర్జీపై ఆధారపడి ఉంటుంది. వాకర్స్ వయసుతో సంబంధం లేకుండా ఎనర్జీని బట్టి వాకింగ్, రన్నింగ్ చేసుకోవచ్చు. ఈ నడక యంత్రం రెండు ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల పొడవు ఉంటుంది. దీని తయారీకి బెల్టులు, బేరింగ్స్, బోల్టులు, డబుల్ నట్స్ వాడినట్లు హరీష్ తెలిపారు. ఈ ట్రెడ్ మిల్ 8 నుంచి 10 సంవత్సరాల లైఫ్ టైం గ్యారెంటీ అని చెప్పారు.  దీని తయారీకి రూ.10 వేల నుంచి రూ.15 వేల ఖర్చైనట్లు పేర్కొన్నారు. ఆర్డర్ పై తయారు చేసి విక్రయిస్తున్నామని రూ.15 వేలు ధరగా నిర్ణయించినట్లు వెల్లడించారు.


కష్టం అన్నారు.. అయితే


తొలుత హరీష్ ఈ ప్రయత్నం ప్రారంభించేటప్పుడు గ్రామస్థులంతా కష్టం అన్నారు. కరెంట్ ట్రెడ్ మిల్ లాంటిది విద్యుత్ లేకుండా పని చేసేలా చేయడం అసాధ్యం అని అనుకున్నారు. అయితే, ఆ మాటలేవీ పట్టించుకోకుండా హరీష్ తన లక్ష్యంపైనే ఫోకస్ పెట్టారు. కొన్ని రోజులు శ్రమించి కర్ర ట్రెడ్ మిల్ తయారు చేసి ఔరా అనిపించుకున్నారు. ఈ పరికరం కరెంట్ ట్రెడ్ మిల్ కు దీటుగా పని చేస్తుండడంతో అంతా హరీష్ ను అభినందిస్తున్నారు.


Also Read: People Que In Front Of Praja Bhavan: ఉదయాన్నే ప్రజా భవన్ ముందు క్యూ కట్టిన జనం- వీడియో షేర్ చేసిన రేవంత్