Rains in Telangana due to Michaung Cyclone: మిగ్ జాం ప్రభావంతో (Michaung) ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని ములుగు (Mulugu), భద్రాద్రి (Bhadradri), ఖమ్మం (Khammam) జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ  నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. అలాగే, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ జిల్లాల్లో సైతం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి - భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఈదురు గాలులు గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు, హైదరాబాద్ లోనూ మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


వర్షాలపై సమీక్ష


మిగ్ జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


Also Read: Congress On Telangana New CM: తెలంగాణ సీఎం అభ్యర్థిపై హైకమాండ్‌కు నివేదిక ఇచ్చిన డీకే శివకుమార్- ఖర్గే నివాసంలో కీలక భేటీ