Union Government Gazette Notification: విద్యుత్ పంపిణీ (Power Distribution) రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం (సెప్టెంబరు 21) ఏకంగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు వద్దని తెలంగామ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తుండగా... బిల్లుతో సంబంధం లేకుండా అందులో ఉన్న అంశాలనే దాదాపు అమల్లోకి తెస్తూ.. తాజా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. విద్యుత్తు పంపిణీ చేసి బిల్లులు వసూలు చేసుకోవడానికి ప్రాంతాల వారీగా కంపెనీలకు జారీ చేసే లైసెన్సుల విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఒక సంస్థ లేదా వ్యక్తి విద్యుత్ పంపిణీ బాధ్యతలు చేపట్టేందుకు ప్రాంతాల పరిధిని నిర్ణయిస్తూ... విద్యుత్తు చట్ట నియమావళికి సవరణ చేస్తూ.. గెజిట్ జారీ చేయడంతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 


జారీ అయిన రోజు నుంచి అమల్లోకి...


విద్యుత్తు పంపిణీని ఏదైనా సంస్థ లేగా వ్యక్తులకైనా అప్పగించే లైసెన్సుల జారీకి ఎంత ప్రాంతాన్ని కేటాయించాలో కేంద్ర విద్యుత్తు శాఖ నోటిఫికేషన్ లో వివరించింది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ -176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ... నియమావళిని సవరించినట్లు తెలిపింది. ఇది జారీ అయిన రోజు నుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు అన్ని వర్గాల ప్రజలకు కరెంటు పంపిణీ చేస్తున్నాయి. ఈ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కింద ఉండటం వల్ల విద్యుత్తు పంపిణీలో భారీగా నష్టాలు వస్తున్నాయని, ప్రాంతాల వారీగా పంపిణీని విభజించి ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. లైసెన్సు కేటాయించే ప్రాంతం ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండాలి. లేదా పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలలను కేటాయించాలని ఈ నోటిఫికేషన్ లో కొత్త నిబంధనను చేర్చింది. 


బుధవారమే మరో గెజిట్ నోటిఫికేషన్..


రాష్ట్ర ప్రభుత్వ యోచన మేరకు ఇంతకన్నా తక్కువ ప్రాంతం అయిన కేటాయించవచ్చని వెసులుబాటు కల్పించింది. అంటే కొత్తగా లైసెన్స్ తీసుకునే సంస్థ లేదా వ్యక్తికి ఎంత ప్రాంతంలో విద్యుత్తు పంపిణీ అధికారం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించకపోతే పక్క పక్కనే ఉన్న మూడు జిల్లాలు లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా లేదా అందులో కొంత ప్రాంతం కేటాయించాలి. డిస్కంల పనితీరును మెరుగుపరిచేందుకు విద్యుత్తు నియంత్రణ మండళ్ల జాతీయ వేదికకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఈ మేరకు మరో గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర విద్యుత్తు శాఖ బుధవారం జారీ చేసింది. దీని ప్రకారం మూడు నెలలకు ఒకసారి విద్యుత్తు కొనుగోలు, పంపిమీ వివరాలు, ఆధాయ వ్యయాలు, ప్రభుత్వాల నుంచి అందాల్సిన రాయితీల గణాంకాల నివేదికలను ప్రతి డిస్కం రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి ఇవ్వాలి.


 నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి..


రాష్ట్ర ప్రబుత్వం ఏ వర్గాలకైనా ఉచితంగా లేదా రాయితీపై కరెంట్ సరపలా చేస్తే ఆ మేరకు నిధులను డిస్కంలకు విడుదల చేశారా లేదా అనేది పక్కాగా టెక్కలివ్వాలి. ఈ లెక్కలను డిస్కంలు సక్రమంగా ఇస్తున్నాయా లేదా అనే వివరాలను ఈఆర్సీల వేదిక ప్రతి త్రైమాసికం తర్వాత నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి. విద్యుత్ చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు కరెంటు ఛఆర్జీల సవరణ ఉత్తర్వులను ప్రతి ఈఆర్సీ జారీ చేయాలి. ఈ ఉత్తర్వులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా జారీ చేస్తున్నారా లేదా, డిస్కంల ఆదాయ వ్యయాల లెక్కలన్నీ ఈ ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీల నిధుల సక్రమంగా వచ్చినట్లు ఇందులో తెలిపారా అనేది ఈఆర్సీలు పక్కాగా గమనించాలి.