Telangana News: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కరెంటు కష్టాలు విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలోనే విద్యుత్ కొనుగోలు కోసం విద్యుత్ పంపిణీ సంస్థ వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. వర్షా కాలంలో రాష్ట్ర డిస్కంలు ఇంతమ మోతాదులో ఎప్పుడూ విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం రాలేదు. గతేడాది ఆగస్టులో వర్షాల వల్ల కరెంటు వినియోగం తగ్గిపోవడంతో మిగులు కరెంటును డిస్కంలు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుని సొమ్ము ఆర్జించాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆగస్టు ప్రారంభం నుంచి వర్షాలు లేకపోవడంతో విద్యుత్ డిమాండ్, వినియోగం గరిష్ట స్థాయికి చేరాయి.  ‘భారత ఇంధన ఎక్స్ఛేంజి’ (ఐఈఎక్స్‌)లో నిత్యం 6, 7 కోట్లకు పైగా యూనిట్ల కరెంటును తెలంగాణ డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయి. ఇలా అన్ని రాష్ట్రాలు ఐఈఎక్స్‌లో కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తుండడంతో.. అక్కడ కూడా తీవ్ర కొరత ఏర్పడింది. యూనిట్‌కు 10 రూపాయల వరకు చెల్లిస్తామంటున్నా ఒక్కోసారి ఐఈఎక్స్‌లో కూడా విద్యుత్ దొరకడం లేదు. 


దేశవ్యాప్తంగా రోజువారీ డిమాండు 2.34 లక్షల మెగావాట్లకు చేరగా.. 7,260 మెగావాట్ల లోటు ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణలో జులై 25వ తేదీన 17 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా.. సరిగ్గా నెల రోజుల్లో 27.56 కోట్ల యూనిట్లకు చేరింది. ఏకంగా 10.56 కోట్ల యూనిట్ల వినియోగం అదనంగా పెరగడంతో ఏరోజుకు ఆరోజు తప్పనిసరిగా ఐఈఎక్స్‌లో అధిక ధరలకు కరెంటు కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా కొని సరఫరా చేయాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా విద్యుత్‌ రాయితీ పద్దు కింద ప్రతి నెలా రూ.958.33 కోట్లు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విడుదల చేస్తోంది. ఈ నెల రాయితీ సొమ్మును 2వ తేదీనే విడుదల చేసింది. కానీ అవి సరిపోలేదని.. ఎక్స్ఛేంజిలో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని డిస్కంలు తెలపడంతో మరో రూ.200 కోట్లు ఇచ్చింది. అవి కూడా సరిపోక డిస్కంలు అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కుంటున్నాయి. 


మరోవైపు ప్రతీ సంవత్సరం కృష్ణానదికి వచ్చే వరదలతో జరిగే విద్యుత్ ఉత్పత్తి వల్ల డిస్కంలకు భారీగా సొమ్ము ఆదా అవుతుంది. జల విద్యుత్ అత్పత్తి వల్ల యూనిట్‌ కరెంటు మూడున్నర రూపాయలకే డిస్కంలకు లభిస్తుంది. కానీ అది లేక ఎక్స్ఛేంజిలో యూనిట్‌కు 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు చెల్లించడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు నష్ట పోవాల్సి వచ్చింది. గత సంవత్సరం వానా కాలంలో పెద్ద ఎత్తున వరదలు రావడం వల్ల రికార్డు స్థాయిలో 600 కోట్ల యూనిట్ల కరెంటును కృష్ణా జలాల నుంచి ఉత్పత్తి చేశారు. కానీ ఈ ఏడాది వర్షా కాలంలో.. గతేడాది వర్షాలతో పోలిస్తే..  అందులో పదోవంతు కూడా ఉత్పత్తి జరగలేదు. దీంత డిస్కంలు పెద్ద ఎత్తున నష్టపోయాయి.


వర్షాలు సరిపడా కురవకపోవడంతో కోటి ఎకరాలకు పైగా సాగైనా పంటలకు 27.54 లక్షల వ్యవసాయ బోర్ల మోటార్లను నడపడానికి రోజూ పెద్ద ఎత్తున కరెంటు వినియోగిస్తున్నారని ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర రావు తెలిపారు. రోజూ ఉదయం పూట వ్యవసాయ బోర్లను, పరిశ్రమలను ఒకేసారి నడపటం వల్ల కరెంటు డిమాండు పెద్ద ఎత్తున పెరుగుతోందని పేర్కొన్నారు. ఆ సమయంలో కోతలు లేకుండా సరఫరా కోసం ఐఈఎక్స్‌లో కొనుగోలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వర్షాలు లేకపోవడంతో డిస్కంలపై ఆర్థిక భారం కూడా అధికంగా పడుతోందని వెల్లడించారు.